Srinivas Goud: కర్ణాటక కుట్రలతో పాలమూరు ఎడారిగా మారుతుంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక!
Srinivas Goud: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం, కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కట్టడం వల్ల పాలమూరు జిల్లా శాశ్వతంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Srinivas Goud: కర్ణాటక కుట్రలతో పాలమూరు ఎడారిగా మారుతుంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక!
Srinivas Goud: ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రస్తుతం కూడా పాలమూరు (మహబూబ్‌నగర్) జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వ కుట్రల వల్ల పాలమూరు శాశ్వతంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు కర్ణాటక సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. "ఏ ధైర్యంతో ఆర్డీఎస్ (RDS) పైన కర్ణాటక రిజర్వాయర్లు కడుతోంది? కృష్ణా నదిపై మరో మూడు బ్యారేజీలకు ప్లాన్ చేయడమే కాకుండా, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు ఇప్పటికే పనులు ప్రారంభించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతులు లేకుండానే ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే జూరాలకు సరిగ్గా నీళ్లు రావడం లేదు, ఒకవేళ ఆల్మట్టి ఎత్తు పెంచితే జూన్, జులై నెలల్లో సైతం కృష్ణా నదికి చుక్క నీరు రాదు. దీనివల్ల పాలమూరు జిల్లా శాశ్వతంగా కరవు కోరల్లో చిక్కుకుంటుంది" అని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కేంద్రానికి తెలంగాణపై ఎలాంటి ప్రేమ లేదని, అందుకే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. "సెక్రటేరియట్‌లో కర్ణాటక మంత్రులతో మీటింగ్ జరిగినప్పుడే పాలమూరు ఎమ్మెల్యేలు తమ అభ్యంతరం తెలిపారు. కానీ, కాంగ్రెస్ నాయకులే అక్కడ బ్యారేజీలకు కాంట్రాక్టర్లుగా మారి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు" అని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికాన్ని ప్రపంచ బ్యాంకుకు చూపించి అప్పులు తెచ్చి ఆంధ్రాలో నిధులు కేటాయించారని.. నాటి కేసీఆర్ ఆర్డీఎస్ నుంచే పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని రగిల్చారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ పాలమూరు ప్రమాదంలో పడిందని, కర్ణాటక ప్రాజెక్టులను ఎలా ఆపాలో తమకు బాగా తెలుసన్నారు. "తెలంగాణ హక్కులను కాలరాస్తే ఊరుకోం. అవసరమైతే సరిహద్దు దాటి వెళ్ళి ఆ ప్రాజెక్టులను బద్దలు కొడుతాం. పాలమూరు రక్షణ కోసం మరోసారి ఆర్డీఎస్ నుంచి పాదయాత్ర చేస్తాం, జిల్లా ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండాలి" అని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.




