పరిగిలో కుక్కల అరాచకం చిన్నారి ముఖాన్ని పీకేసిన వీధికుక్క!
వికారాబాద్ జిల్లా పరిగి బీసీ కాలనీలో వీధికుక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దవడ ఎముక విరగడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలింపు.
పరిగిలో కుక్కల అరాచకం చిన్నారి ముఖాన్ని పీకేసిన వీధికుక్క!
పరిగి/వికారాబాద్: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వీధి కుక్కలు మరోసారి పడగ విప్పాయి. బీసీ కాలనీలో నివాసం ఉంటున్న బాలయ్య అనే వ్యక్తికి చెందిన నాలుగేళ్ల కుమార్తెపై వీధి కుక్కలు దాడి చేశాయి.
చిన్నారి ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా వచ్చిన కుక్క ఆమెపై దాడి చేసింది. ఈ క్రమంలో కుక్క చిన్నారి మూతిపై (ముఖంపై) తీవ్రంగా కరిచింది. పాప అరుపులు విన్న తల్లిదండ్రులు, స్థానికులు పరుగెత్తుకు రావడంతో కుక్క అక్కడి నుండి పారిపోయింది.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖంపై గాయం కావడంతో చిన్నారి పండ్ల దగ్గర ఉన్న ఎముక విరిగింది అని డాక్టర్లు చెప్పడంతో వెంటనే నగర ఆసుపత్రికి నిలోఫర్ కి తరలించారు.
పరిగి పట్టణంలో రోజురోజుకూ వీధి కుక్కల బెడద ఎక్కువవుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, వీధి కుక్కలను నియంత్రించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని స్థానికులు కోరుతున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని కోరుతున్నారు




