Hyderabad: నరహరిరావు బ్యాంకు లాకర్ బద్దలుకొట్టిన ఏసీబీ.. రూ.కోటిన్నర నగదు, 2.5 కిలోల బంగారం సీజ్!

Hyderabad: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ చేతికి చిక్కిన అధికారి సుంకరి నరహరిరావు బ్యాంకు లాకర్‌ను అధికారులు బద్దలుకొట్టారు. ఈ సోదాల్లో రూ.కోటిన్నర నగదు, 2.5 కిలోల బంగారాన్ని ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 4:42 PM IST
Hyderabad: నరహరిరావు బ్యాంకు లాకర్ బద్దలుకొట్టిన ఏసీబీ.. రూ.కోటిన్నర నగదు, 2.5 కిలోల బంగారం సీజ్!
X

నరహరిరావు బ్యాంకు లాకర్ బద్దలుకొట్టిన ఏసీబీ.. రూ.కోటిన్నర నగదు, 2.5 కిలోల బంగారం సీజ్!

Hyderabad: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ‘సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డులు’ మల్టీజోన్‌-2 ఉపసంచాలకులు (డిప్యూటీ డైరెక్టర్) సుంకరి నరహరిరావు కేసులో అంత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శనివారం బద్దలుకొట్టారు. ఈ లాకర్‌లో ఊహించని స్థాయిలో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు, భారీగా బంగారం బయటపడటం సంచలనం సృష్టిస్తోంది.

సుంకరి నరహరిరావు అక్రమ సంపాదనకు సంబంధించి బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవగా.. ఆయన కుటుంబ సభ్యులు లాకర్ తాళం చెవులు ఇచ్చేందుకు నిరాకరించారు. అధికారుల దర్యాప్తుకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో వెనక్కి తగ్గని ఏసీబీ అధికారులు వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రత్యేక 'సెర్చ్‌ వారెంట్‌' సంపాదించారు. ఆ వారెంట్‌తో బ్యాంకుకు చేరుకుని, లాకర్‌ను బద్దలుకొట్టి సోదాలు నిర్వహించారు.

ఏసీబీ అధికారులు లాకర్ ఓపెన్ చేయగానే అందులో గుట్టలుగా దాచిన అవినీతి సొమ్ము చూసి అవాక్కయ్యారు. ఆ లాకర్ నుంచి రూ. 1,50,00,000 (కోటిన్నర రూపాయల) నగదు. 2.5 కిలోల (రెండున్నర కేజీల) తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

పాతబస్తీలోని నరహరిరావు నివాసంలో ఇటీవల ఏసీబీ అధికారులు జరిపిన ప్రాథమిక సోదాల్లోనే కట్టలు కట్టలుగా అక్రమ సొమ్ము, కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను అప్పట్లోనే ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ అవినీతి అధికారి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా బ్యాంకు లాకర్‌లో దొరికిన కోట్లాది రూపాయల నగదు, బంగారంతో నరహరిరావు చుట్టూ ఏసీబీ ఉచ్చు మరింత బిగుసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story