మూఢనమ్మకాలతో యువతి హత్య.. డెంగీ వస్తే దెయ్యం పట్టిందని బెల్టుతో కొట్టి చంపిన కుటుంబ సభ్యులు!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో డెంగీతో బాధపడుతున్న యువతికి దెయ్యం పట్టిందంటూ మూఢనమ్మకంతో భర్త, అత్తామామలు బెల్టుతో కొట్టడంతో ఆమె మృతి చెందింది.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 4:42 PM IST
మూఢనమ్మకాలతో యువతి హత్య.. డెంగీ వస్తే దెయ్యం పట్టిందని బెల్టుతో కొట్టి చంపిన కుటుంబ సభ్యులు!
X

మూఢనమ్మకాలతో యువతి హత్య.. డెంగీ వస్తే దెయ్యం పట్టిందని బెల్టుతో కొట్టి చంపిన కుటుంబ సభ్యులు!

అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన సమాజంలో.. ఇప్పటికీ కొన్నిచోట్ల మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాలను బలిగొంటున్నాయి. అనారోగ్యాన్ని వైద్య సమస్యగా కాకుండా దెయ్యం పట్టడం, గాలి సోకడం అంటూ అపోహలతో కొట్టడం వల్ల ఒక నిండు ప్రాణం బలైన అమానుష ఘటన తెలంగాణలో కలకలం రేపింది. డెంగీ సోకి అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి వైద్యం చేయించాల్సింది పోయి, చేతబడి, దెయ్యం శక్తులని భావించి కుటుంబ సభ్యులే ఆమెపై పాశవిక దాడికి పాల్పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సోమేసరా నయా గ్రామానికి చెందిన ప్రియాంక మాల్‌ (26), తన భర్త పరాస్ మాల్‌తో కలిసి బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నివాసముంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

అయితే, ఇటీవల ప్రియాంక కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె పడుతున్న ఇబ్బందిని వైద్యపరమైన సమస్యగా చూడాల్సిన భర్త, అత్తామామలు.. ఆమెకు ఏదో దుష్టశక్తి సోకిందని, దెయ్యం పట్టి ఉంటుందని మూఢనమ్మకంతో నమ్మారు. ఒంటిపై దెబ్బలు కొడితే ఆ దెయ్యం వదిలిపోతుందని కొందరు మాంత్రికులు సూచించడంతో దారుణానికి ఒడిగట్టారు. భర్త పరాస్ మాల్‌తో పాటు అత్త, మామలు కలిసి ఆమెను బెల్టుతో అతి క్రూరంగా కొట్టారు.

కుటుంబ సభ్యుల దాడిని తాళలేక, ప్రాణభయంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రియాంక ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భయపడిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఈ ఘటనపై వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు డెంగీ (Dengue) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు స్పష్టమైంది. ఆమెకు సోకింది డెంగీ జ్వరం అని తేలడంతో పాటు, మూఢనమ్మకాలతో కుటుంబ సభ్యులే ఆమెను కొట్టి చంపారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఈ అమానుష ఘటనపై పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు స్పందించారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే కాలయములుగా మారడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.