Supreme Court: కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి సుప్రీం కోర్టు బ్రేక్.. చెట్లను నరకొద్దని ఆదేశం!

Supreme Court: హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 18 May 2026 2:21 PM IST
Supreme Court:
X

Supreme Court: కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి సుప్రీం కోర్టు బ్రేక్.. చెట్లను నరకొద్దని ఆదేశం!

Supreme Court: హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) జాతీయ పార్కు వద్ద ప్రతిపాదిత ఫ్లైఓవర్ల నిర్మాణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం పెద్ద ఎత్తున చెట్లను తొలగించడంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ కేసులో తదుపరి విచారణ జరిగే వరకు పార్కు పరిధిలో ఎలాంటి చెట్లను కొట్టేయవద్దని (Stay) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పర్కు పరిధిలోని పర్యావరణ సున్నిత ప్రాంతంలో (Eco-Sensitive Zone) సుమారు 25 నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ముట్టుకోవద్దని కోర్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ పనుల కోసం పార్కు సరిహద్దుల్లో దాదాపు 1,300 చెట్లను నరికేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్‌రెడ్డి న్యాయస్థానానికి వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా చెట్లు నరుకుతున్నారని, పర్యావరణ సున్నిత ప్రాంతంలో చెట్లు నరకొద్దని అభివృద్ధి బోర్డు సైతం గతంలో చెప్పిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా విచారణ జరిపిన ధర్మాసనం.. "ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రణాళిక ఏమైనా ఉందా? చెట్లను తొలగించకుండానే ఫ్లైఓవర్ నిర్మించే అవకాశం ఉందా?" అని ప్రశ్నించింది. దానికి పిటిషనర్ల లాయర్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి అలాంటి ప్రణాళికలేవీ లేవని, వాస్తవానికి ప్రభుత్వమే ముందస్తు ఆలోచన లేకుండా చెట్లను తొలగిస్తోందని కోర్టుకు తెలిపారు.

ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం సుప్రీం కోర్టు కీలక ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలకు (MoEF) నోటీసులు జారీ చేసింది. పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఫ్లైఓవర్ల నిర్మాణంపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను జులై 27వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story