Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ ముదిరింది.

Arun Chilukuri
Updated on: 26 Jun 2026 11:29 AM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్!

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్షకు సిద్ధమవడంతో, పట్టణంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. కేతిరెడ్డి నివాసం చుట్టూ భారీగా బలగాలను మోహరించిన పోలీసులు.. ఆయన బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు చేస్తున్న దాడులకు నిరసనగా స్థానిక గాంధీ కూడలిలో దీక్ష చేపడతామని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే ఈ దీక్షా నిర్ణయంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్రంగా దాడులు చేసిన వారు.. ఇప్పుడు కొత్తగా దీక్షలు చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు విమర్శించారు. గాంధీ కూడలిలో దీక్ష నిర్వహిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, ఖచ్చితంగా అడ్డుకుంటామని టీడీపీ హెచ్చరించింది.

రెండు పార్టీల మధ్య సవాల్-ప్రతిసవాల్‌లతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు.

పట్టణంలోని కీలక కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీనియర్ పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story