Talasani Srinivas Yadav: ప్రభుత్వాన్ని కూల్చే శక్తి కార్మికులకు ఉంది.. ఆర్టీసీ సమ్మెలో మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు!

Talasani Srinivas Yadav: ఆర్టీసీ సమ్మెకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం. కేసీఆర్ మీ వెంటే ఉన్నారంటూ కార్మికులకు భరోసా. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి కార్మికులకు ఉందని హెచ్చరిక. సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు.

Arun Chilukuri
Published on: 23 April 2026 12:23 PM IST
Talasani Srinivas Yadav
X

Talasani Srinivas Yadav: ప్రభుత్వాన్ని కూల్చే శక్తి కార్మికులకు ఉంది.. ఆర్టీసీ సమ్మెలో మాజీ మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు!

Talasani Srinivas Yadav: తెలంగాణలో రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాణిగంజ్ డిపో వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక కేసీఆర్ గారు, మా పార్టీ మొత్తం ఉంది. తెలంగాణ సాధనలో మీ పాత్ర మరువలేనిది అని కార్మికులకు భరోసా ఇచ్చారు.

అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని, ఆ విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వం కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరిస్తున్న ఆర్టీసీ ఎండీపై తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ముందు నీ ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకో.. వచ్చేది మా ప్రభుత్వమే" అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం మెడలు వంచి హామీలు సాధించుకోవడానికి అందరం కలిసి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చెబుతున్న 29 డిమాండ్ల అంగీకారం ఏంటో మీడియా సాక్షిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా కాకుండా, పీఆర్‌సీ (PRC) సహా అన్ని హామీలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. "ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతో నడిపిస్తున్నారు. ఏళ్ల తరబడి బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లకు అవి నడపడం రాదా?" అని ప్రశ్నించారు. ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని, వెంటనే జేఏసీని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story