Telangana: అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: AITUC మేకల దాసు!

Telangana: కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీ ప్రకారం అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం, రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని AITUC రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 2 Nov 2026 2:01 PM IST
Telangana
X

Telangana: అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలి: AITUC మేకల దాసు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఐసీడీఎస్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని AITUC రాష్ట్ర కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పదవీ విరమణ అనంతరం నెలకు రూ.10 వేల పెన్షన్ అందించాలని కోరారు. అలాగే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలు చేయడం, ప్రీ-స్కూల్ విద్యతో పాటు ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇంతటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తగిన వేతనాలు లేకపోవడం, బిల్లులు పెండింగ్‌లో ఉండటం, అదనపు విధుల భారం వంటి సమస్యలతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల సేవలకు ఆటంకం కలగకుండా టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) విధుల నుంచి మినహాయించాలని, సిబ్బందికి పీఎఫ్, హెల్త్ కార్డులు, రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల పెండింగ్ బిల్లులు, టీచర్లు, హెల్పర్లకు రావాల్సిన TA-DA బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.

ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు, అర్హత, సర్వీసు ఆధారంగా గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. 2023 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, పదవీ విరమణ చేసిన సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యం చేయకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మేకల దాసు స్పష్టం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు AITUC వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు భూపతి రమాదేవి, కార్యదర్శి తోకల సరస్వతి, AITUC జిల్లా అధ్యక్షుడు ఎం.డి. అక్బర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్, కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్‌తో పాటు పి. సురేఖ, నేరేళ్ల అరుణ, కె. తిరుమల, ఇంద్ర, శంకరమ్మ, కుసుమ కుమారి, పద్మారెడ్డి, ఎ. అరుణ, సరోజ, బి. శైలజ, కనకలక్ష్మి, శారద, సంధ్య, జాడి కృప తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.