Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేడు అక్కడ భారీ వర్షాలు, ఇక్కడ భానుడి భగభగలు
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో నేడు వాతావరణం భిన్నంగా మారనుంది. దక్షిణ తెలంగాణ, ఏపీలలో రాత్రి వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉత్తర తెలంగాణలో వడగాలులు వీవనున్నాయి.
Weather Update
Weather Update : ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే పలకరించే నైరుతి రుతుపవనాలు ఈసారి చాలా ఆలస్యంగా వచ్చాయి. గత ఏడాది మే 26నే రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, ఈసారి జూన్ 8న మాత్రమే తెలంగాణ సరిహద్దుల్లోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత కూడా వాటి గమనం చాలా మందగించడంతో జూన్ నెల చివరికి వస్తున్నా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీంతో అటు రైతులు, ఇటు సాధారణ ప్రజలు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ సహా ఈ జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన తాజా వివరాల ప్రకారం.. మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. శనివారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడవచ్చు. భాగ్యనగరం హైదరాబాద్‌లో కూడా రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది.
ఉత్తర తెలంగాణలో భగభగలాడుతున్న ఎండలు
ఒకవైపు దక్షిణ తెలంగాణలో వర్షాల సూచనలు ఉంటే, మరోవైపు ఉత్తర తెలంగాణలో ఎండలు రికార్డులు సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 17 జిల్లాల పరిధిలోని 59 మండలాల్లో అత్యంత తీవ్రమైన వడగాలులు వీచాయి. అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా రామగుండంలో సాధారణంగా 34.9 డిగ్రీలుగా ఉండాల్సిన ఉష్ణోగ్రత ఏకంగా 41.9 డిగ్రీలకు చేరింది. నిజామాబాద్‌లో 41.3 డిగ్రీలు, హన్మకొండలో 41 డిగ్రీలు, మెదక్‌లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు మండలాలు ఈ వేడి సెగకు అల్లాడిపోయాయి.
తెలంగాణ నేటి వాతావరణ గణాంకాలు
తెలంగాణలో శనివారం ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 36°C వరకు నమోదయ్యే అవకాశం ఉండగా, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C వరకు పడిపోవచ్చు. అయితే గాలిలో తేమ శాతం సుమారు 49% గా ఉండటం వల్ల సాధారణ ఉష్ణోగ్రత కంటే ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదయం వేళల్లో నమోదయ్యే 27°C ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ప్రజలకు 30°C అంతకంటే ఎక్కువగా అనిపిస్తుంది. పగటి సమయంలో వర్షం పడేందుకు కేవలం 10% మాత్రమే అవకాశం ఉండగా, రాత్రి సమయానికి రుతుపవనాల ప్రభావం పెరిగి వర్షం పడే అవకాశం 40% కి పెరుగుతుంది. గాలి వాయువ్య దిశ నుంచి గంటకు 16 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు తూర్పు విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు వాతావరణం చల్లబడనుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C గాను, రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 28°C గాను నమోదు కావచ్చు. పగటిపూట తేలికపాటి జల్లులు పడేందుకు 25% అవకాశం ఉండగా, రాత్రి సమయానికి మేఘాలు దట్టంగా మారి వర్షం కురిసే అవకాశం 60% వరకు ఉంది. పశ్చిమ దిశ నుంచి గంటకు 8 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం అత్యధికంగా 56% వరకు నమోదు కావచ్చు.
ప్రజలకు, రైతులకు అధికారుల అత్యవసర హెచ్చరికలు
ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ నేడు, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు ఆకాశం మేఘావృతమైనప్పుడు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు. ఉరుములు వచ్చే సమయంలో సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందడం మంచిదని సూచించారు. రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుకుగా మారితేనే రెండు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని నిపుణులు చెబుతున్నారు.




