Weather Update: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడన గండం.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు అల్పపీడన గండం.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Weather Update: నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది. ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాబోయే మూడు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక వివరాలు వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ తీరాల వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
"శుక్రవారం (జులై 3) రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకూడదు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది."
ఉరుములు, పిడుగుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉండే సమయంలో జాగ్రత్తలు వహించాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.




