Telangana: తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్.. మంత్రి కీలక ప్రకటన!

Telangana: తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్‌కు డ్రైవర్లు సిద్ధమవడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

Ravi
By Ravi
Published on: 23 Aug 2026 5:22 PM IST
Telangana
X

Telangana: తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్.. మంత్రి కీలక ప్రకటన!

Telangana: తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్‌కు డ్రైవర్లు సిద్ధమవడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని, సమ్మెను విరమించుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో, క్యాబ్ అలాగే స్కూల్ వ్యాన్ డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ బంద్ ప్రారంభం కానుందని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు స్పష్టం చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12000 ఆర్థిక సాయం అందించాలనే హామీని వెంటనే అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు. దీంతోపాటు గత మూడేళ్లుగా ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు పాతిక లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారందరి కోసం ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గత ప్రభుత్వం అమలు చేసిన రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని కొనసాగించడంతో పాటు, ఆన్‌లైన్ క్యాబ్ అగ్రిగేటర్ల కోసం ప్రభుత్వమే స్వయంగా ఒక ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు, నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకుని ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను తక్షణమే సవరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుందని, రేపటి నుంచి ఎలాంటి వాహనాలు రోడ్డెక్కవని కరాఖండిగా స్పష్టం చేశారు. నిరసనలో భాగంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ సమ్మె ప్రకటనపై హుస్నాబాద్ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని హామీ ఇస్తూ, సమ్మెను విరమించుకోవాలని ఆయన డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. రవాణా రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకుందామని ఆయన సూచించారు.

ముఖ్యంగా ఆటో కార్మికుల దీర్ఘకాలిక సంక్షేమం కోసం అతి త్వరలో ఒక ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం ఎంతో సానుభూతితో పరిశీలిస్తోందని ఆయన మీడియాకు తెలిపారు.

అలాగే ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన ఛార్జీల పెంపుపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారు. గత 2015 సంవత్సరం నుంచి ఆటో ఛార్జీలు పెరగలేదని, ఈ పదేళ్ల కాలంలో పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఛార్జీల పెంపుపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ వేస్తామని మంత్రి ప్రకటించారు.

ఈ కమిటీలో రవాణా శాఖ అధికారులతో పాటు ఆటో వర్కర్ల ప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉంటారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story