Telangana Auto Bandh: 30న తెలంగాణలో ఆటోల బంద్.. డ్రైవర్ల కీలక నిర్ణయం!
Telangana Auto Drivers Bandh: తెలంగాణలో ఈ నెల 30న ఆటోల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. మీటర్ చార్జీల పెంపుతో పాటు 15 డిమాండ్లను పరిష్కరించాలని కోరింది.
Telangana Auto Bandh: 30న తెలంగాణలో ఆటోల బంద్.. డ్రైవర్ల కీలక నిర్ణయం!
Telangana Auto Drivers Bandh: తెలంగాణలో ఈ నెల 30వ తేదీన ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ జేఏసీ ప్రకటించింది. ఆటో మీటర్ చార్జీల పెంపుతో పాటు తమకు సంబంధించిన 15 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ వెల్లడించారు. ఆదివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆటో మీటర్ చార్జీలు పెంచాలి
తమిళనాడులో అమలవుతున్న విధంగా తెలంగాణలోనూ ఆటో మీటర్ చార్జీలను పెంచాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ క్యాబ్‌లను వెంటనే నిషేధించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, గత మూడేళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.36 వేలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కారణంగా ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మహ్మద్ అమానుల్లా ఖాన్ కోరారు. అదేవిధంగా జీవో నంబర్ 2063 కింద మిగిలి ఉన్న ఆటోలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి 15 రోజుల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. ఈలోగా డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ముజాహిద్ హాస్మీ, రమేష్, అబ్దుల్ రజాక్, ఆంజనేయులు, మహబూబ్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.




