Paneer Ban: కల్తీ పన్నీర్ దందాపై సర్కార్ సీరియస్.. అమల్లోకి కొత్త రూల్స్
Paneer Ban: హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పన్నీర్ వంటకాలను లొట్టలేసుకుని తినే నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది.
Paneer Ban
Paneer Ban: హోటళ్లు, దాబాలు, రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పన్నీర్ వంటకాలను లొట్టలేసుకుని తినే నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. మార్కెట్లో విచ్చలవిడిగా తయారవుతున్న కృత్రిమ, నాన్-డైరీ అనలాగ్ పన్నీర్ దందాపై ఆహార భద్రతా అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కల్తీ పదార్థాల విక్రయాలపై రాష్ట్రంలో తక్షణ నిషేధం అమల్లోకి వచ్చింది.
ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న కృత్రిమ పన్నీర్ దందా
సాధారణంగా నాణ్యమైన అసలైన పన్నీర్‌ను ఆవు లేదా గేదె పాలను ఉపయోగించి తయారు చేస్తారు. కానీ విపరీతమైన లాభాలు గడించాలనే దురాశతో కొందరు కేటుగాళ్లు పామాయిల్, కెమికల్ పౌడర్లు, ఇతర హానికర రసాయనాలతో నకిలీ పన్నీర్‌ను తయారు చేస్తున్నారు. చూడటానికి అసలు పన్నీర్‌లాగే కనిపించే ఈ నాన్-డైరీ అనలాగ్ పదార్థాలు వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. కాలేయం, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు బారిన పడేలా చేస్తున్న ఈ కల్తీ దందాపై ఫిర్యాదులు అందడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.
ఉత్తర్వులు జారీ చేసిన ఆహార భద్రతా అధికారులు
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనలాగ్ పన్నీర్‌పై సంపూర్ణ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లోని సెక్షన్ 30(2)(a) కింద టూ ఆఫీసర్స్ సేఫ్టీ (టీజీ సేఫ్) ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పన్నీర్ పేరుతో ఇటువంటి కృత్రిమ వస్తువులను తయారు చేయడం, ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, నిల్వ ఉంచడం, మార్కెట్లో విక్రయించడం పూర్తిగా నేరమని హెచ్చరించింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు
నిషేధాజ్ఞలు అమల్లోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద గోదాములు, హోల్‌సేల్ మార్కెట్లలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించి నాన్-డైరీ అనలాగ్ పన్నీర్‌ను నిల్వ ఉంచినా లేదా విక్రయిస్తున్నట్లు తేలినా కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. వ్యాపారులు ఎవరూ కూడా ఇటువంటి అనధికారిక, హానికర ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు.




