Analogue Paneer: తెలంగాణలో అనలాగ్ పనీర్‌పై ఏడాది నిషేధం

తెలంగాణలో అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై ఏడాది నిషేధం విధించారు. సెప్టెంబర్ 10 నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 12:20 AM IST
Telangana Bans Analogue Paneer
X

Telangana Bans Analogue Paneer

తెలంగాణలో అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, విక్రయాలను నిషేధిస్తూ తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) నోటిఫికేషన్ జారీ చేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. సెప్టెంబర్ 10, 2026 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

అసలు పనీర్ పేరుతో అనలాగ్ పనీర్ విక్రయాలు

సంప్రదాయ పాలతో తయారు చేసే పనీర్‌ను పోలి ఉండేలా అనలాగ్ పనీర్‌ను తయారు చేస్తారు. ఇందులో వెజిటబుల్ ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్, స్టార్చ్‌లు, ఇతర నాన్-డెయిరీ పదార్థాలను ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఉత్పత్తి రూపం, ఆకృతి పరంగా అసలు పనీర్‌ను పోలి ఉంటుంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో అసలు పాల పనీర్ పేరుతో అనలాగ్ పనీర్‌ను విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో తక్కువ ధరకు లభించే అనలాగ్ పనీర్‌ను ఉపయోగించి వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అనలాగ్ పనీర్‌లో ఏం వాడతారు?

అనలాగ్ పనీర్‌ను ప్రధానంగా స్కిమ్డ్ మిల్క్ పౌడర్, వెజిటబుల్ ఆయిల్స్, ఎమల్సిఫయర్లు, స్టెబిలైజర్లతో తయారు చేస్తారు. సంప్రదాయ పనీర్‌కు దగ్గరగా కనిపించేలా, అదే తరహా ఆకృతిని వచ్చేలా దీనిని రూపొందిస్తారు.

తక్కువ ధర కారణంగా కొన్ని వ్యాపార సంస్థలు దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు అది అసలు పాల పనీర్ కాదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిషేధం

అనలాగ్ పనీర్‌పై చర్యలు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అనలాగ్ పనీర్‌పై నిషేధం విధించాయి.

అనలాగ్ పనీర్‌ను FSSAI అనుమతిస్తుందా?

దేశంలోని అత్యున్నత ఆహార భద్రత నియంత్రణ సంస్థ అయిన FSSAI అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను కొన్ని నిబంధనలతో అనుమతిస్తోంది. అయితే వాటిని అసలు పాల పనీర్ పేరుతో విక్రయించకూడదు. ఉత్పత్తిలోని పదార్థాలను, అది నాన్-డెయిరీ ఉత్పత్తి అనే విషయాన్ని లేబుల్‌పై స్పష్టంగా పేర్కొనాలి.

కానీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థల్లో మెనూలో అసలు పాల పనీర్ ఉపయోగిస్తున్నారా లేదా అనలాగ్ పనీర్ ఉపయోగిస్తున్నారా అనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడంపై ఆహార భద్రత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏడాది పాటు అనలాగ్ పనీర్‌పై నిషేధం విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్