Bars Closed: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్..

Bars Closed: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రివిలేజ్ సెస్ పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ ప్రకటించాయి.

Arun Chilukuri
Updated on: 5 Oct 2026 12:17 PM IST
Bars Closed
X

Bars Closed: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్లు బంద్..

Bars Closed: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన 'ప్రివిలేజ్ సెస్' నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నట్లు అసోసియేషన్ ఆదివారమే అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వం విధిస్తున్న ఈ కొత్త పన్నుల వల్ల ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న వ్యాపారాలు మరింత కుదేలవుతాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ప్రతి బార్‌పై వార్షికంగా 8% నుంచి 20% వరకు ప్రివిలేజ్ సెస్ విధించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇప్పటికే తాము ఏటా రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు భారీగా లైసెన్స్ ఫీజులను ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన ఈ సెస్ అమలోకి వస్తే ప్రతి బార్‌పై ఏడాదికి అదనంగా మరో రూ.30 లక్షల వరకు ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వైన్ షాపుల వద్ద శాశ్వత పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా అనధికారిక బెల్ట్ షాపులు పుట్టుకురావడం వల్ల తమ వ్యాపారం ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ప్రివిలేజ్ సెస్ పేరిట అదనపు భారాన్ని మోపడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని, తెలంగాణవ్యాప్తంగా 1,200కు పైగా బార్ అండ్ రెస్టారెంట్లు ఈ బంద్‌‌లో పాల్గొంటాయని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే సోమవారం ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో నిరాహార దీక్షలకు దిగుతామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.