ఇది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్.. బీజేపీ సంచలన ఆరోపణలు
Ramchander Rao: ‘భారత్ సమ్మిట్’ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
ఇది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్.. బీజేపీ సంచలన ఆరోపణలు
Ramchander Rao: ‘భారత్ సమ్మిట్’ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. రాహుల్ గాంధీ రాకతో పాటు ఈ సదస్సు నిర్వహణకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (BJP) శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శాంతిభద్రతల దృష్ట్యా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తమ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్టు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని, అది ముమ్మాటికీ ‘యాంటీ-భారత్ సమ్మిట్’ అని బీజేపీ నేతలు ఆరోపించారు. రాజకీయంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీని మరోసారి రీలాంచ్ చేసేందుకే తెలంగాణ ప్రజల పన్నుల సొమ్మును వృథా చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నారని వారు విమర్శించారు. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను పిలిచి దేశ వ్యతిరేక శక్తులకు వేదిక కల్పిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇతర హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి నిత్యం నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తోందని వారు ఆరోపించారు.




