Telangana: తెలంగాణలో వింత వాతావరణం: అల్లాడిస్తున్న ఎండలు.. మరోవైపు దంచికొట్టనున్న వర్షాలు!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, వరుణుడు అకాల వర్షాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు.

Srinivas Rao
Published on: 20 April 2026 3:49 PM IST
Telangana
X

Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, వరుణుడు అకాల వర్షాలతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వింత పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మండిపోతున్న ఎండలు.. ఆరెంజ్ హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం , మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత విపరీతంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తర , దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వేడి గాలుల ప్రభావం దృష్ట్యా సోమవారం వాతావరణ శాఖ 'ఆరెంజ్' హెచ్చరికలను జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అకాల వర్షాలు.. వడగళ్ల వాన ముప్పు

ఎండలు ఒకవైపు వేధిస్తుండగా, మరోవైపు ద్రోణి , క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా లో కూడా వాతావరణం చల్లబడనుంది. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి , మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈరోజు వాతావరణ పరిస్థితులను గమనిస్తే, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే వర్షం పడే సూచనలు అంతగా కనిపించడం లేదు. నగరంలో రాత్రి సమయంలో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉన్నప్పటికీ, రోజంతా వాతావరణం పొడిగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ వాసులకు ఎండల నుంచి తక్షణ ఉపశమనం లభించే అవకాశం తక్కువగానే ఉంది.

తీరని ఉక్కపోత.. పెరగనున్న ఇబ్బందులు

సాధారణంగా వర్షం కురిస్తే ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు పడినా ఉక్కపోత నుంచి ఉపశమనం లభించదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని, దీనివల్ల ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. అకాల వర్షాల వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story