Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో మహిళలకు గుడ్ న్యూస్ ఉంటుందా? రూ.2,500 పథకంపై సర్వత్రా ఉత్కంఠ

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్ 2026-27లో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనిపై ఆర్థిక శాఖ సీఎంకు నివేదిక సమర్పించింది.

CR Reddy
Published on: 20 March 2026 8:55 AM IST
Telangana Budget 2026
X

Telangana Budget 2026

Telangana Budget 2026: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామన్న హామీ అత్యంత కీలకమైంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ రాయితీ వంటివి అమలు చేస్తున్నా, నేరుగా ఖాతాల్లో నగదు పడే ఈ పథకం కోసం రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్‌లో ఈ పథకానికి మోక్షం కలుగుతుందా? లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రెండేళ్ల నిరీక్షణ.. నేడు తేలనున్న లెక్క

కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచాలని చూస్తోంది. అయితే, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, అందుకే కొన్ని హామీల అమలు ఆలస్యమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్సు ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నా.. నెలకు రూ.2,500 ఇచ్చే పథకంపై మాత్రం సర్కార్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ముందడుగు వేయలేదు. ఈ నేపథ్యంలో నేటి బడ్జెట్ ప్రసంగంపై అందరి దృష్టి నెలకొంది.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

ఈ పథకం అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై ఏటా ఎంత భారం పడుతుంది? అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు? అనే విషయాలపై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ఒక సమగ్ర నివేదికను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను వెతకడం లేదా ఇతర పథకాల కేటాయింపుల్లో సర్దుబాటు చేయడం ద్వారా ఈ పథకాన్ని విడతల వారీగానైనా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

విపక్షాల విమర్శలు - మహిళల నిరసనలు

ఎన్నికల హామీలను గాలికొదిలేశారని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. "ఓట్లు వేయించుకుని ఇప్పుడు మహిళలను పట్టించుకోవడం లేదు" అంటూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచినందున, కనీసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుండైనా డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తేనే మహిళల నమ్మకాన్ని నిలబెట్టుకోగలమని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్‌లో ఇతర ప్రాధాన్యతలు ఇవే!

నేడు ప్రవేశపెట్టే సుమారు రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల పెంపునకు అగ్రతాంబూలం దక్కే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ (యంగ్ ఇండియా స్కూల్స్), బస్తీ దవాఖానాల విస్తరణకు భారీగా నిధులు కేటాయించనున్నారు. ఈ ప్రాధాన్యత క్రమంలో మహిళా ఆర్థిక సాయం స్కీమ్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారా? లేక త్వరలోనే అమలు చేస్తాం అనే పాత మాటనే మళ్లీ చెబుతారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

CR Reddy

CR Reddy

Next Story