Cheyutha Pension: కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. మంగళవారం నుంచి వడబోత ప్రక్రియ!

Cheyutha Pension: తెలంగాణలో చేయూత పథకం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.

Arun Chilukuri
Published on: 31 Aug 2026 7:21 AM IST
Cheyutha Pension
X

Cheyutha Pension: కొత్త పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. మంగళవారం నుంచి వడబోత ప్రక్రియ!

Cheyutha Pension: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న చేయూత పథకం కింద కొత్త సామాజిక పింఛన్ల దరఖాస్తులకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.34 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సోమవారంతో గడువు ముగియనుండగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం 2.50 లక్షల మందికి మాత్రమే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించడంతో, అర్హుల ఎంపిక కోసం మంగళవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన (వడబోత ప్రక్రియ) ప్రారంభం కానుంది.

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన 2.50 లక్షల కొత్త పెన్షన్లకే అనుమతించినందున.. వచ్చిన దరఖాస్తుల్లో సుమారు సగం మందికే లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

కేటగిరీల వారీగా దరఖాస్తుల వివరాలు:

మొత్తం 4,34,854 దరఖాస్తులు రాగా, వాటిలో వివిధ వర్గాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:

వితంతువులు: 2,64,815 (అత్యధికంగా)

దివ్యాంగులు: 1,07,171

గీత కార్మికులు: 26,343

ఒంటరి మహిళలు: 26,057

చేనేత కార్మికులు: 10,468

జిల్లావారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 27,554 మంది దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా ములుగు జిల్లా నుంచి 3,620 మంది దరఖాస్తులు సమర్పించారు.

మంగళవారం నుంచి క్షేత్రస్థాయి పరిశీలన (వడబోత):

దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో అందిన దరఖాస్తులన్నింటినీ అధికారులు క్రోడీకరిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన 2.50 లక్షల కోటాకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేసేందుకు మంగళవారం నుంచి 'వడబోత ప్రక్రియ' చేపట్టనున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ బిల్‌ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిజమైన అర్హులను ఎంపిక చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story