Telangana Pension Updates : పింఛన్ తీసుకుంటున్న అవ్వతాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana Pension Updates : తెలంగాణలో చేయూత పథకం పింఛన్ల నగదు పంపిణీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. అక్రమాలను అరికట్టేందుకు ఆగస్టు నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా సొమ్ము జమ చేయనున్నారు.

CR Reddy
Published on: 4 Jun 2026 8:24 AM IST
Cheyutha Scheme
X

Cheyutha Scheme

Telangana Pension Updates : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లబ్ధిదారులకు ఇకపై చేతికి నగదు రూపంలో పింఛన్ ఇచ్చే పాత పద్ధతికి ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికింది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను, లీలలను అరికట్టడమే ధ్యేయంగా.. ఇకపై పెన్షన్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నగదు చెల్లింపుల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలో 42 లక్షల మంది లబ్ధిదారులు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన సుమారు 42 లక్షల మంది చేయూత పథకం కింద పింఛన్లు పొందుతున్నారు. వీరిలో సగం మందికి ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల ద్వారా నిధులు అందుతుండగా.. మిగిలిన వృద్ధులు, దివ్యాంగులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు ప్రతి నెలా చేతికి నగదు ఇస్తున్నారు. మరికొందరికి పోస్టల్ ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.

అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

అయితే, క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే నగదు పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లు, లబ్ధిదారులకు పూర్తి మొత్తంలో డబ్బులు అందడం లేదంటూ ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనికి తోడు పోస్టల్ ఆఫీసుల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు డబ్బుల కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల పింఛన్లను నేరుగా వారి అకౌంట్లలోనే వేయాలని సీఎం ఆదేశించారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాల ఓపెనింగ్ షురూ

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఎవరైతే చేతికి నగదు రూపంలో పెన్షన్ తీసుకుంటున్నారో, వారందరికీ కొత్తగా పోస్టల్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ అకౌంట్లు ఓపెన్ అయితే ప్రభుత్వమే నేరుగా అందులో డబ్బులు వేస్తుంది. లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు ఆ సొమ్మును నేరుగా బ్యాంకుకు వెళ్లి గానీ, లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా గానీ ఎప్పుడైనా సులభంగా డ్రా చేసుకోవచ్చు.

ఆగస్టు నుంచి నేరుగా ఖాతాల్లోకి పెన్షన్ పైసలు

ఈ కొత్త విధానాన్ని సజావుగా అమలు చేయడం కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ పేరిట లబ్ధిదారుల నిర్ధారణ, ధృవీకరణ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. పింఛన్ దారులు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని డిజిటల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నారు. జూన్ నెలాఖరు నాటికి ఈ అథెంటికేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. జూలైలో డేటా మొత్తాన్ని క్రోడీకరించి, వచ్చే ఆగస్టు నెల నుంచి పింఛన్ సొమ్మును నేరుగా లబ్ధిదారుల పోస్టల్ లేదా సాధారణ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story