Revanth Reddy: మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కుట్ర.. కేంద్రంపై సీఎం ఫైర్

Revanth Reddy: మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ తీసుకొచ్చి దక్షిణాదికి అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ విధానాల వల్లే బిల్లు వీగిపోయిందని ఆయన మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 18 April 2026 2:51 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కుట్ర.. కేంద్రంపై సీఎం ఫైర్

Revanth Reddy: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఈ బిల్లు ఓటమిని బీజేపీ విధానాల పరాజయంగా అభివర్ణించిన ఆయన, ప్రధాని మోదీకి మహిళా రిజర్వేషన్లపై నిజాయితీ లేదని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేంద్రం తీరును తీవ్రంగా ఎండగట్టారు.

మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును జొప్పించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని సీఎం మండిపడ్డారు. "ప్రధాని మోదీ ఉత్తర, దక్షిణ భారత్ మధ్య అంతరాలు సృష్టించే విధానాలను విరమించుకోవాలి. నిజాయితీగా మహిళా బిల్లును తెచ్చి ఉంటే పార్లమెంట్‌లో అందరూ మద్దతు పలికేవారు" అని ఆయన స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి చిత్తశుద్ధి ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 2023 నాటి మహిళా బిల్లును యధాతథంగా పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. అయితే, అందులో ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ మహిళలకు సబ్-రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story