Revanth Reddy: 2028 నాటికి పోలీసు శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. అమరవీరుల దినోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన!

Revanth Reddy: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.

Arun Chilukuri
Updated on: 21 Oct 2026 12:44 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: 2028 నాటికి పోలీసు శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.. అమరవీరుల దినోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన!

Revanth Reddy: ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గోషామహల్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన 'పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం' కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజ శాంతిభద్రతల కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 155 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి వేగంగా సాగుతాయని అభిప్రాయపడ్డారు.

2028 నాటికి ఖాళీలన్నీ భర్తీ:

పోలీసు శాఖ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. 4,773 కానిస్టేబుల్ పోస్టులతో సహా మొత్తం 7,437 పోస్టుల భర్తీకి అనుమతులిచ్చామని, 2028 నాటికి పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను విడతల వారీగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 112 మంది డీఎస్పీలకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకాలు ఇచ్చామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఇచ్చే ఎక్స్ గ్రేషియాను హోదాను బట్టి రూ.కోటికి పైగా పెంచినట్లు వెల్లడించారు.

పోలీస్ పిల్లలకు అంతర్జాతీయ స్కూల్:

పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారి పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని, హోంగార్డుల కుటుంబాలకు కూడా ఉచిత వైద్య భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. సాంకేతికత ఎంత పెరిగినా పోలీసుల ప్రవర్తనలో మానవీయ దృక్పథం తగ్గకూడదని సూచించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్యులకే.. నేరస్థులకు కాదు:

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. "ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు, సామాన్యులు, అమాయకుల పట్ల మాత్రమే ఉండాలి. నేరస్థులు, కబ్జాదారులు, డ్రగ్స్ దందా చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి" అని ఆదేశించారు. డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని అభినందించారు. అలాగే ఆహార కల్తీ నిరోధానికి 'టీజీ సేఫ్' (TG SAFE) ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను ట్రాన్స్‌జెండర్లకు అప్పగించి సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.