Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ సెగ.. ఢిల్లీ బాట పట్టిన ఎమ్మెల్యేలు..
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి వర్గ విస్తరణ సెగ రాజుకుంది. మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు.
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ సెగ.. ఢిల్లీ బాట పట్టిన ఎమ్మెల్యేలు..
Telangana Cabinet Expansion: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన జరుగుతుందనే ప్రచారం జోరందుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రి పదవులపై కన్నేసిన ఆశావహులు అలర్ట్ అయ్యారు. ఎలాగైనా క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలనే పట్టుదలతో ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు హుటాహుటిన ఢిల్లీ బాట పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ నేతల మధ్య ఇప్పుడీ లాబీయింగ్ కాస్త అంతర్గత పోరుకు దారితీస్తోంది.
మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాజాగా ఢిల్లీ వేదికగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేరుగా కలిసిన ఆయన.. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నానని, కష్టకాలంలోనూ పార్టీ జెండా మోశానని రాహుల్ గాంధీకి వివరించారు. తన సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఈసారి క్యాబినెట్‌లో ఖచ్చితంగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టిన విషయం తెలియగానే.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం అప్రమత్తమయ్యారు. ఆయన కూడా హుటాహుటిన దేశ రాజధానికి పయనమయ్యారు. రాహుల్ గాంధీని కలిసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తనకే మంత్రి పదవి దక్కేలా చూడాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా సమీకరణాలు, పార్టీలో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని రాహుల్ ఎదుట ఉంచినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ విస్తరణపై కసరత్తు చేస్తున్నారనే లీకుల నడుమ.. ఒకే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు బలమైన నేతలు ఒకరిని మించి ఒకరు ఢిల్లీ స్థాయిలో పోటీ పడటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మంత్రివర్గ విస్తరణ వ్యవహారం గులాబీ శ్రేణులను కాదని, కాంగ్రెస్ లోపల ఉన్న సీనియర్ల మధ్య మరోసారి అంతర్గత విభేదాలకు, అసంతృప్తులకు దారి తీస్తుందా? అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.




