Konda Surekha: సీఎం రేవంత్‌పై వ్యాఖ్యల దుమారం.. కొండా సురేఖ, జి. చిన్నారెడ్డిలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు..!
Konda Surekha: వరంగల్, వనపర్తి కాంగ్రెస్ విభేదాలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్ర చర్యలు చేపట్టింది.
Konda Surekha: సీఎం రేవంత్‌పై వ్యాఖ్యల దుమారం.. కొండా సురేఖ, జి. చిన్నారెడ్డిలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు..!
Congress: తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, టికెట్ల పంచాయితీ మరోసారి బహిర్గతమయ్యాయి. సొంత ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సీనియర్ నేతలు, వారి కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
వరంగల్ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయింపు అంశంపై రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై, పీసీసీ నేతలపై బహిరంగంగానే సంచలన ఆరోపణలు, సవాళ్లు విసిరారు.
ఈ పరిణామంపై తక్షణమే స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరానిదని భావించిన పార్టీ అధిష్ఠానం, మంత్రి కొండా సురేఖకు అధికారికంగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుమార్తె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయంలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరుపై బహిరంగంగా విమర్శలు గుప్పించి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో సీనియర్ నేత, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డికి సైతం కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపింది. చిన్నారెడ్డి కూడా మూడు రోజుల్లో తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ నాయకులను, సొంత పార్టీ ఎమ్మెల్యేలను రచ్చకెక్కి విమర్శిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరించింది. ఇద్దరు సీనియర్ నేతలకు ఒకేసారి నోటీసులు జారీ చేయడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది.




