Transgenders : ట్రాన్స్‌జెండర్ల ఆగడాలపై పోలీసులకు కీలక ఆదేశాలు!
DGP CV Anand: ట్రాఫిక్ సిగ్నల్స్, శుభకార్యాల వద్ద ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Transgenders : ట్రాన్స్‌జెండర్ల ఆగడాలపై పోలీసులకు కీలక ఆదేశాలు!
DGP CV Anand: ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు మరియు శుభకార్యాల వద్ద కొందరు ట్రాన్స్‌జెండర్లు సాగిస్తున్న బలవంతపు వసూళ్లు, భిక్షాటన మాఫియా ఆగడాలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో తాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఇలాంటి దందాలు, భిక్షాటన ముఠాల వేధింపులు ఎక్కువ కావడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అడ్డుకట్ట వేసిన విషయాన్ని డీజీపీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇటీవల మళ్లీ ఈ తరహా వేధింపులు పెరుగుతుండటంతో.. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లకు తక్షణమే స్పెషల్ డ్రైవ్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. వాహనదారులను, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ట్రాన్స్‌జెండర్లను సమాజంలో గౌరవప్రదమైన ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని డీజీపీ స్పష్టం చేశారు. ఇప్పటికే వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, హైడ్రా విధుల్లోకి తీసుకుని ప్రోత్సహిస్తున్నామని, అక్కడ బాధ్యతలు చేపట్టిన వారు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
అయితే, ప్రభుత్వం గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. కొందరు అసాంఘిక శక్తులుగా మారి దందాలు, భిక్షాటన ముఠాల పేరుతో ప్రజలను వేధిస్తే ఎంతమాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని డీజీపీ ఖరాకండిగా తేల్చిచెప్పారు.




