‘చనిపోయాక దెయ్యమై చూసుకుంటా’: కానిస్టేబుల్ సూసైడ్ నోట్

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 10:40 AM IST
‘చనిపోయాక దెయ్యమై చూసుకుంటా’: కానిస్టేబుల్ సూసైడ్ నోట్
X

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ (డీజీపీ కార్యాలయం) ప్రాంగణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అక్కడ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న స్వామి అనే పోలీసు సిబ్బంది తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయంలో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆయన వాష్‌రూమ్‌కి వెళ్లారు. అక్కడ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం రావడంతో తోటి సిబ్బంది వెంటనే వాష్‌రూమ్ వద్దకు పరుగెత్తుకెళ్లగా, స్వామి రక్తం మడుగులో పడివుండటాన్ని గమనించారు.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఘటనా స్థలంలో స్వామి రాసిన డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో లభ్యమైన సూసైడ్ నోట్ పలువురిని కలచివేస్తోంది. "నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య, పిల్లలను ఏమీ అనవద్దు.. వాళ్లు చాలా మంచివాళ్లు. చనిపోయిన తర్వాత నేను దెయ్యంగా మారైనా సరే.. వాళ్లను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటాను" అని స్వామి ఆ నోట్‌లో రాసుకొచ్చారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story