Telangana: ఒడిశా అడవుల్లో తెలంగాణ ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి..!
Telangana: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సంచలన ఆపరేషన్! ఒడిశా అడవుల్లో ఏకంగా 80 కిలోమీటర్లు వెంబడించి రూ.లక్షల విలువైన 500 కేజీల గంజాయిని, రవాణా చేస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు.
Telangana: ఒడిశా అడవుల్లో తెలంగాణ ‘ఈగల్ ఫోర్స్’ మెరుపు దాడి..!
Telangana: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాలు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలపై తెలంగాణ ‘ఈగల్ పోర్స్’ సరిహద్దులు దాటి వెళ్లి అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. ఒడిశా రాష్ట్రంలో భారీ ఎత్తున దాదాపు 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
ఇటీవల తెలంగాణలో పట్టుబడిన స్థానిక గంజాయి ముఠాల లింకులు, వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈగల్ ఫోర్స్ టీమ్ నేరుగా ఒడిశా రాష్ట్రానికి వెళ్లి నిఘా పెట్టింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన ఈగల్ ఫోర్స్ బృందం.. ఒడిశాలోని బలిమెల నుంచి జయపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర గంజాయి వాహనాన్ని విడకుండా వెంబడించింది. పోలీసులు ఎంతకీ వదలకుండా వెంబడిస్తుండటాన్ని గమనించిన బొలెరో వాహన డ్రైవర్, మార్గమధ్యంలో పోలీసులకు దొరకకుండా వాహనాన్ని రోడ్డు పక్కన వదిలేసి దట్టమైన అడవుల్లోకి పరారయ్యాడు.
పోలీసులు సదరు బొలెరో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అందులో వివిధ సైజుల్లో ప్యాకెట్లుగా ప్యాక్ చేసి ఉంచిన 500 కిలోల భారీ గంజాయి నిల్వలు బయటపడ్డాయి. ఈ గంజాయిని, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని ఈగల్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి తరలిస్తున్న ఆ బొలెరో వాహనం ఎవరిదనే కోణంలో పోలీసులు రికార్డులు పరిశీలించగా.. అది ఒడిశాలోని గాంధీనగర్‌కు చెందిన అమీర్ అలీఖాన్ అనే వ్యక్తి పేరుతో ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? ఈ నెట్‌వర్క్ ఎక్కడివరకు విస్తరించింది? అనే అంశాలపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ తదుపరి దర్యాప్తును వేగవంతం చేసింది.




