తెలంగాణ క్యాబినెట్‌లో విప్లవాత్మక మార్పు.. ఇకపై అంతా డిజిటల్..
Telangana Digital Cabinet: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలను పేపర్‌లెస్ (డిజిటల్) విధానంలో నిర్వహించనున్నారు.
తెలంగాణ క్యాబినెట్‌లో విప్లవాత్మక మార్పు.. ఇకపై అంతా డిజిటల్..
Telangana Digital Cabinet: పాలనలో ఆధునికతను జోడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్) సమావేశాలను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త విధానం అమలు కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల వ్యయంతో ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తోంది.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న క్యాబినెట్ డిజిటల్ విధానాన్ని అధ్యయనం చేసిన ప్రభుత్వం.. దాన్ని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు, ప్రాధాన్యతలకు అనుగుణంగా తగిన మార్పులు చేసి ఇక్కడ అమలు చేయనుంది.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేటెడ్ (NICSI)తో చర్చలు జరిపి ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అనుకూలీకరిస్తున్నారు (Customize). ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS)ను నోడల్ ఏజెన్సీగా నియమించారు. ప్రాజెక్టు ప్రారంభ పనుల కోసం మొదటి విడతగా రూ.20 లక్షల నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు లేదా కంప్యూటర్లను అందిస్తారు. వీటి ద్వారానే వారు క్యాబినెట్ ఎజెండాలు, ఫైళ్లను పరిశీలించవచ్చు. క్యాబినెట్ నోట్స్, శాఖల వారీ ప్రతిపాదనలు, తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఇకపై పేపర్ లేకుండా పూర్తిగా డిజిటల్ రూపంలోనే నిక్షిప్తమై ఉంటాయి.
ఈ డిజిటల్ విధానం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత, మరియు సౌలభ్యాన్ని మరింత పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫైళ్ల కదలికలు వేగవంతం కావడం వల్ల నిర్ణయాలు త్వరగా అమల్లోకి వస్తాయి.
క్యాబినెట్ ఫైళ్లు అత్యంత రహస్యమైనవి కాబట్టి.. డేటా లీకేజీ, హ్యాకింగ్ నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా మంత్రులకు, ఉన్నతాధికారులకు ప్రత్యేక లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో పాటు, అత్యంత బలమైన మల్టీ-లేయర్ సెక్యూరిటీ వ్యవస్థలను ఈ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తున్నారు.




