New Dialysis Centers: డయాలసిస్ పేషెంట్స్ కి తెలంగాణ గవర్నమెంట్ శుభవార్త
New Dialysis Centers: రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెరుగైన వైద్యం, నిరంతర చికిత్సను సామాన్యులకు చేరువ చేసే లక్ష్యంతో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
New Dialysis Centers
New Dialysis Centers: రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెరుగైన వైద్యం, నిరంతర చికిత్సను సామాన్యులకు చేరువ చేసే లక్ష్యంతో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లోని రోగుల కష్టాలను తీరుస్తూ, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. డయాలసిస్ కోసం గంటల తరబడి ప్రయాణం చేసి నగరాలకు రావాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే చికిత్స అందేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి ఏజెన్సీ , గిరిజన ప్రాంతాల్లో ఈ సేవలను విస్తరించనున్నారు. ఈ కొత్త కేంద్రాల ద్వారా అదనంగా 416 పడకలు అందుబాటులోకి రానున్నాయి.
హబ్ అండ్ స్పోక్ మోడల్ - సాంకేతిక పరిజ్ఞానం
ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్వహించనున్నారు. 'హబ్ అండ్ స్పోక్' విధానం ద్వారా సేవలను పర్యవేక్షిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ప్రధాన 'హబ్'లుగా వ్యవహరిస్తూ, జిల్లాల్లోని కేంద్రాలకు అవసరమైన సాంకేతిక సలహాలు, మార్గదర్శకాలను అందిస్తాయి. దీనివల్ల మారుమూల కేంద్రాల్లో కూడా నగర స్థాయి నాణ్యమైన వైద్యం లభిస్తుంది.
మౌలిక సదుపాయాల కల్పన
కొత్తగా ఏర్పాటు చేయబోయే కేంద్రాలతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న 67 కేంద్రాలను కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. వీటిలో అదనంగా 155 అత్యాధునిక డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కొత్త కేంద్రంలో అవసరాన్ని బట్టి 5 నుండి 10 యంత్రాలను అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీనివల్ల నిరీక్షణ సమయం తగ్గి, అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.
వేగంగా టెండర్ల ప్రక్రియ
ప్రతిష్టాత్మక నిర్ణయానికి సంబంధించి తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వీలైనంత త్వరగా నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంతో వేల సంఖ్యలో కిడ్నీ బాధితులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, వారి జీవితకాలం పెరిగే అవకాశం కలుగుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




