HILT Policy Telangana : హైదరాబాద్‌కు సరికొత్త లుక్.. రంగంలోకి చారిత్రాత్మక హిల్ట్ పాలసీ

HILT Policy Telangana : హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక హిల్ట్ పాలసీ విధివిధానాలను ఖరారు చేసింది.

CR Reddy
Published on: 24 May 2026 8:55 AM IST
HILT Policy Telangana
X

HILT Policy Telangana

HILT Policy Telangana : హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు వేసింది. నగర భవిష్యత్తును, ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా మలుపు తిప్పే భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో కసరత్తుల తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీ అమలుకు ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త విధానానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను (Guidelines) ఆన్‌లైన్ వేదికగా విడుదల చేసింది. ఈ పాలసీ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల వినియోగాన్ని పూర్తిగా మార్చేయబోతున్నారు.

జనావాసాల మధ్య పొగ గొట్టాలు అవుట్

గడిచిన ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ నగరం ఊహించని వేగంతో, అన్ని వైపులా విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల, అటవీ ప్రాంతాలకు దగ్గరగా నిర్మించిన బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక వాడలు ఇప్పుడు మహానగరం నడిబొడ్డుకు చేరిపోయాయి. ఫ్యాక్టరీల పక్కనే పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలియడంతో కాలనీల ప్రజలు తీవ్రమైన వాయు, జల కాలుష్యాల బారిన పడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మానవతా, పర్యావరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే హిల్ట్ పాలసీ ముఖ్య ఉద్దేశం. ఓఆర్ఆర్ లోపల ఉన్న భారీ, కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించి, ఆ స్థలాలను ప్రజలకు ఉపయోగపడేలా మార్చనున్నారు.

పాత ఫ్యాక్టరీల స్థలాల్లో ఐటీ పార్కులు, అపార్ట్‌మెంట్లు

ఈ సరికొత్త పాలసీ ప్రకారం పాత పారిశ్రామిక భూములకు మల్టీ-యూజ్ జోన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఆయా భూములను ఇకపై కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం చేయకుండా.. అత్యాధునిక ఐటీ పార్కులు, విలాసవంతమైన విల్లా ప్రాజెక్టులు, నివాస అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలకు వాడుకునే వెసులుబాటు కలుగుతుంది. తమ పరిశ్రమలను సిటీ వెలుపలికి తరలించే యజమానులకు నష్టపరిహారంగా ఓఆర్ఆర్ అవతల ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ వ్యవహారంలో పారిశ్రామిక వేత్తలను ఒప్పించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించారు. త్వరలోనే ప్రజల సలహాల కోసం ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా తీసుకురానున్నారు.

హీటెక్కిన తెలంగాణ రాజకీయం

హిల్ట్ పాలసీ గైడ్‌లైన్స్ బయటకు వచ్చినప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఈ విధానం వెనుక ఏకంగా లక్ష కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణం దాగి ఉందంటూ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలు పారిశ్రామిక వాడల్లో పర్యటించిన ప్రతిపక్ష నేతలు, భూముల మార్పిడికి ఒప్పుకునే ప్రసక్తే లేదని పరిశ్రమల యజమానులకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే విపక్షాలు ఎంత రచ్చ చేస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ గైడ్‌లైన్స్ విడుదల చేయడం విశేషం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story