Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు!

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

Ravi
By Ravi
Published on: 26 Jun 2026 9:29 AM IST
Telangana
X

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా ల్యాప్‌టాప్‌లు!

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థులకు శుభవార్తను అందించింది. ఉన్నత చదువులు చదవాలనుకునే నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించే దిశగా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ కాలేజీల్లో సీట్లు సాధించిన రాష్ట్ర విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక విద్యను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పొందిన వారితో పాటే బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఫ్రీగా ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ సరఫరా చేయడానికి కూడా నిధులు మంజూరు చేసింది.

వీటితో పాటు విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. దురదృష్టవశాత్తు ఎవరైనా విద్యార్థులు మరణిస్తే వారి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నేటి డిజిటల్ యుగంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు ఈ ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ పేద విద్యార్థులకు ఒక వరంగా మారుతుందని, భవిష్యత్తులో మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story