Grama Panchayat Funds: సర్పంచులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పల్లెల అభివృద్ధికి రూ.9,968 కోట్ల భారీ నిధులు!
Grama Panchayat Funds: తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. 16వ ఆర్థిక సంఘం ద్వారా ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్ల నిధులను కేటాయించింది.
Grama Panchayat Funds: సర్పంచులకు కేంద్రం బంపర్ ఆఫర్.. పల్లెల అభివృద్ధికి రూ.9,968 కోట్ల భారీ నిధులు!
Grama Panchayat Funds: తెలంగాణలోని స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల అభివృద్ధి కోసం కేంద్ర 16వ ఆర్థిక సంఘం భారీ మొత్తంలో నిధులను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు (ఐదేళ్ల కాలానికి) గాను తెలంగాణ రాష్ట్రానికి రూ.9,968 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే, ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణకు సంబంధించి అత్యంత స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
నిధులు దేనికి వాడాలి? దేనికి వాడకూడదు?
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఈ నిధులను కేవలం స్థానిక సంస్థల పరిధిలోని ప్రజోపయోగ పనులకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది.
గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరచడం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణం, మరియు స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు మాత్రమే ఈ నిధులను వాడాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి లేదా ఇతర పరిపాలనా పరమైన ఖర్చులకు వినియోగించకూడదని కేంద్రం ఖచ్చితమైన అదేశాలు జారీ చేసింది.
నిధుల దుర్వినియోగానికి తావులేకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి నిబంధనలను తీసుకొచ్చింది. ప్రతి స్థానిక సంస్థ తాము ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ఏడాది కాలంలో ఏయే పనులకు ఎంతెంత నిధులు ఖర్చు చేశారో, దానివల్ల జరిగిన అభివృద్ధి ఏమిటో వివరిస్తూ సమగ్ర నివేదికను (Audit Report) రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటిని క్రోడీకరించి కేంద్రానికి నివేదించాలి. ఒకవేళ ఆడిటింగ్‌లో లోపాలున్నా, నిధులు దారిమళ్లినట్లు తేలినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థల కోసం 16వ ఆర్థిక సంఘం ఐదేళ్ల కాలానికి గాను మొత్తం రూ.4,35,236 కోట్లను గ్రాంట్లుగా ప్రకటించింది. ఈ నిధులలో సింహభాగం అంటే 80 శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించారు. మిగిలిన నిధులలో 10 శాతం మండల పరిషత్‌లకు, మరో 10 శాతం జిల్లా పరిషత్‌లకు అందజేయనున్నారు.
ప్రతి ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో రెండు విడతలుగా ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే, మొత్తం నిధుల్లో 20 శాతం నిధుల విడుదల అనేది ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల పనితీరు (Performance) ఆధారంగానే ఉంటుంది.
2026 నాటి అంచనాల ప్రకారం.. గ్రామీణ జనాభాకు 90 శాతం ప్రాధాన్యత, రాష్ట్ర వైశాల్యానికి 10 శాతం ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయించారు. ఈ లెక్కన తెలంగాణ గ్రామీణ జనాభా పరంగా 1.92 శాతం, వైశాల్యం పరంగా 0.37 శాతం వాటాను దక్కించుకొని, మొత్తంగా రూ.9,968 కోట్ల భారీ ప్యాకేజీని సొంతం చేసుకుంది. ఈ నిధులతో తెలంగాణ పల్లెలు సరికొత్త రూపురేఖలను సంతరించుకోనున్నాయి.




