Weather Alert : రెయిన్‌కోట్లు, గొడుగులు రెడీ చేసుకోండి బాస్.. వారం రోజుల పాటు వరుణుడి వరుస బ్యాటింగ్.!
Weather Alert : ఎండ దెబ్బకి ఇన్నాళ్లూ విలవిల్లాడిన జనాలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై ప్రత్యేక
rain alert
Weather Alert : ఎండ దెబ్బకి ఇన్నాళ్లూ విలవిల్లాడిన జనాలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై ప్రత్యేక ప్రేమను కురిపించబోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి అప్డేట్ ప్రకారం.. రాష్ట్రంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా భారీ వర్షాలు దంచికొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల వైపు ఈ వాన దేవుడు కాస్త గట్టిగానే కన్నేశాడని అధికారులు హింట్ ఇచ్చారు.
ఆ జిల్లాలకు 'ఎల్లో' అలర్ట్.. గాల్లో తేలే ప్రమాదం ఉందోచ్
వాన పడితే రోడ్లన్నీ చెరువులవుతాయనే భయం ఒకవైపు ఉంటే.. వాతావరణ శాఖ మాత్రం ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాలు, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు.. మన రాజధానికి ఇరువైపులా ఉండే మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందట. అంతటితో ఆగకుండా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయట.. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు కాస్త బరువుగా ఉండేలా చూసుకోవడం మంచిది, లేదంటే ఆ గాలుల వేగానికి ఎగిరిపోయినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే సూర్యుడు మబ్బుల చాటున దాక్కుని, ఆకాశం అంతా క్లౌడీగా మారిపోయింది.
సాయంత్రం తర్వాత అసలు సినిమా..!
ఇక మన భాగ్యనగరం ముచ్చటకొస్తే.. వీకెండ్ ప్లాన్స్ వేసుకునే వారికి వాతావరణ శాఖ టైమ్ టేబుల్ కూడా ఇచ్చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఆఫీసుల నుంచి లంచ్‌కి వెళ్లే టైమ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పలకరించే అవకాశం ఉందట. అయితే అసలు సినిమా సాయంత్రం 6 గంటల తర్వాతే మొదలవుతుందని అధికారులు సెలవిచ్చారు. సాయంత్రం కాగానే వాన తీవ్రత పెరిగి, రాత్రి సమయానికి భారీ వర్షంగా మారే ముప్పు ఉందట.
కాబట్టి, ఆఫీసుల నుంచి ఇంటికి తొందరగా బయలుదేరడం ఉత్తమం. లేదంటే ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని రోడ్డు మీదే డిన్నర్ చేయాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి ఈ వారం రోజుల పాటు వానలతో ఇటు ప్రకృతి పులకరించిపోతుంటే.. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు మాత్రం ఓ వాన దేవుడా.. కాస్త చూసి దయతల్చవయ్యా.. అని ఇప్పుడే ప్రార్థనలు మొదలుపెట్టేస్తున్నారు.




