Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఊరట
Telangana High Court: 2011 మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఈ తీర్పుతో పెద్ద ఉపశమనం లభించింది.
Telangana High Court: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఊరట
Telangana High Court: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అత్యంత కీలకమైన 'మిలియన్ మార్చ్' ఉదంతంపై నమోదైన కేసుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, మరియు హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి వారిపై ఉన్న ఆరోపణలను న్యాయస్థానం కొట్టివేసింది.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 మార్చి 10న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 'మిలియన్ మార్చ్' నిర్వహించారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో అప్పటి పోలీసులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆనాడు జరిగిన ఘటనలతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే వారిని ఈ కేసులో నిందితులుగా చేర్చారని న్యాయస్థానానికి వివరించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, వారిపై నమోదైన కేసులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాదాపు 15 ఏళ్ల నాటి కేసుల నుంచి విముక్తి లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




