TG Inter Results 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదలపై క్లారిటీ ఇచ్చిన బోర్డు.. ఎప్పుడంటే ?

TG Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారు అయింది. ఈనెల 11 లేదా 12న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.

CR Reddy
Updated on: 10 April 2026 10:38 AM IST
Telangana Inter Results 2026
X

Telangana Inter Results 2026 

Inter Results 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఒక తీపి కబురు అందబోతోంది. గత కొన్ని రోజులుగా ఫలితాల విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు శరవేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సమాచారం ప్రకారం.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈనెల 11 (శనివారం) లేదా 12 (ఆదివారం) తేదీల్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఒకవేళ ఈ రెండు రోజుల్లో వీలుకాకుంటే సోమవారం నాటికి ఖచ్చితంగా వెల్లడికానున్నాయి. శనివారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని బోర్డుకు ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు అందాయి. విద్యాశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అధికారికంగా సమయాన్ని ప్రకటిస్తారు.

ఈసారి ఫలితాల విషయంలో బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంది. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, సుమారు 1.05 లక్షల మంది విద్యార్థులు కేవలం ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యి, కేవలం ఒకే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడంపై బోర్డు దృష్టి పెట్టింది. మూల్యాంకనంలో ఏవైనా పొరపాట్లు జరిగాయా అని తెలుసుకునేందుకు ఆ విద్యార్థుల జవాబు పత్రాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అయిన వారికి న్యాయం చేసేలా ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఫలితాల విడుదలతో పాటు ఇంటర్ బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందించాలని నిర్ణయించారు. అలాగే, ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఈ కొత్త సంస్కరణల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయించి, తద్వారా విద్యార్థులకు భరోసా ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

ఫలితాలు ఇలా చూసుకోండి:

* ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింద పేర్కొన్న పద్ధతిలో తమ మార్కులను తెలుసుకోవచ్చు:

* ముందుగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించండి.

* హోమ్ పేజీలో "Inter Results 2026" అనే లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.

* మీ హాల్ టికెట్ నంబర్‌ను, అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

* 'Submit' బటన్ నొక్కగానే మీ ఫలితాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

* భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీని ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story