Telangana: ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ

Telangana: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 లోగో, మస్కట్‌ను కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ, సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 15 Nov 2026 11:23 PM IST
Telangana
X

Telangana: ఘనంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ ఆవిష్కరణ

తెలంగాణ: తెలంగాణ వేదికగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఎనిమిదవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు సంబంధించిన లోగో, మస్కట్‌ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, క్రీడల ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, సాట్స్ ఎండీ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరిగే ఈ క్రీడా సంబరాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.21 కోట్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.203.13 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను కేవలం క్రీడల నిర్వహణకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని స్టేడియాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తామని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తులోనూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సాధనకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మొత్తం 27 క్రీడాంశాలు ఉండగా, తెలంగాణ సంప్రదాయ క్రీడ అయిన కర్రసామును కూడా చేర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 7 వేల మందికి పైగా క్రీడాకారులతో పాటు సుమారు 1,200 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొననున్నారని వెల్లడించారు.

హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు మత్తు వదలండి.. మైదానాలు చేరండి అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నశా ముక్త్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి, క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు.

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా తెలంగాణ క్రీడా ప్రతిభ దేశవ్యాప్తంగా చాటడంతో పాటు, రాష్ట్రాన్ని క్రీడా రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL