Telangana Land Rates : సామాన్యుడి సొంత ఇంటి కల ఇక కల్లే.. తెలంగాణలో జూన్ 5 నుంచి భూములకు కొత్త ధరలు

Telangana Land Rates : తెలంగాణలో జూన్ 5 నుంచి సవరించిన భూముల కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం 15 నుంచి 100 శాతం వరకు పెంచింది.

CR Reddy
Published on: 4 Jun 2026 7:14 AM IST
Telangana Land Rates
X

Telangana Land Rates

Telangana Land Rates : తెలంగాణలో భూముల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు షాక్ ఇస్తూ కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడానికే ఈ సవరణలు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రాంతాల అభివృద్ధి, ఓఆర్ఆర్ (ORR), ట్రిపుల్ ఆర్ (RRR) కారిడార్లు, పారిశ్రామిక వృద్ధిని బట్టి శాస్త్రీయంగా ఈ ధరలను మార్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిర్ణయంతో ప్రజలపై అనివార్యంగానే రిజిస్ట్రేషన్ చార్జీల భారం పడనుంది.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల రేట్లు భారీగా పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ప్రభుత్వ విలువ రూ.10 కోట్లకు చేరగా, శేరిలింగంపల్లిలో గరిష్ఠంగా రూ.30 కోట్లుగా ఖరారు చేశారు. హనుమకొండలో ఎకరం రూ.3 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల ధరలను పెంచారు. పల్లెల్లో గతంలో ఎకరం కనీస ధర రూ.75 వేలు ఉండగా, దాన్ని ఏకంగా 266.66 శాతం పెంచి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీల్లో కనీస ఎకరం ధర రూ.5 లక్షలుగా మారింది.

ప్లాట్లు, ఫ్లాట్లు కొనాలనుకునే వారిపై కూడా ప్రభుత్వం గట్టిగానే బాదుడు షురూ చేసింది. ఓపెన్ ప్లాట్ ధర గజానికి కనీసం రూ. 1,500 ఉండగా దాన్ని రూ. 3 వేలకు పెంచారు. అపార్ట్‌మెంట్ ఫ్లాట్ల కనీస ధరను రూ.2 వేల నుంచి గరిష్ఠంగా రూ.6,500 - 8,000 వరకు సవరించారు. పాత హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలో ఓపెన్ ప్లాట్ల కనీస ధర గజానికి రూ.2 వేలుగా మారింది. అపార్ట్‌మెంట్లలో ఇన్నాళ్లూ ఫ్లోర్‌ను బట్టి రేట్లు మారగా, ఇకపై అన్ని అంతస్తులకు ఒకే రకమైన ధరను వర్తింపజేయనున్నారు.

బహిరంగ మార్కెట్ ధరకు, ప్రభుత్వ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి 15 శాతం నుంచి గరిష్ఠంగా 100 శాతం వరకు విలువలను పెంచారు. ఎక్కడైతే మార్కెట్ ధర కంటే ప్రభుత్వ విలువ 500 శాతం తక్కువగా ఉందో అక్కడ వంద శాతం రేట్లు పెరిగాయి. ఈ పెంపు ద్వారా ఏడాదికి రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే మందగించిన రియల్ ఎస్టేట్ రంగంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని, సామాన్యులు ఇళ్లు, స్థలాలు కొనడానికి వెనకడుగు వేసే పరిస్థితి వస్తుందని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story