Real Estate : తెలంగాణలో భారీగా పెరగనున్న భూముల ధరలు.. మే మొదటి వారం నుంచే కొత్త రేట్లు అమలు
Real Estate :తెలంగాణలో మే మొదటి వారం నుంచి పెరగనున్న భూముల మార్కెట్ విలువలు. రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి పరిశ్రమల తరలింపునకు హిల్ట్ పాలసీ సిద్ధం చేసింది.
Telangana Land Rates
Real Estate : తెలంగాణలో స్థిరాస్తి రంగానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మే మొదటి వారం నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల రిజిస్ట్రేషన్ల భారం పెరగనుండటంతో భూములు కొనేవారు, అమ్మేవారు ఇప్పుడే అప్రమత్తమవుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు కాలుష్య కారక పరిశ్రమల తరలింపుపై కూడా సర్కార్ ఫోకస్ పెట్టింది.
మే నెల నుంచే కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మే మొదటి వారం నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసింది. దీనివల్ల సామాన్యులపై రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరగనుంది.
భూముల వివరాల సేకరణపై కఠినం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలు, ఆక్రమణలకు గురైన భూముల వివరాలను వెంటనే సేకరించాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి శాఖ తన పరిధిలోని భూముల రికార్డులను పక్కాగా ఉంచాలని, ఆదాయ వనరులను పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకురాబోతోంది. నగరంలోని చర్లపల్లి, ఉప్పల్, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ప్రాంతానికి తరలించనున్నారు. చైనా తరహాలో అక్కడ అత్యాధునిక పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పారిశ్రామికవేత్తల సూచనలను పరిగణనలోకి తీసుకుని, భూ కన్వర్షన్ ఛార్జీల తగ్గింపుపై కూడా సానుకూలంగా స్పందించింది.
కార్మికుల కోసం డార్మెటరీలు
కొత్త పారిశ్రామిక విధానంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు నివసించేందుకు డార్మెటరీల ఏర్పాటును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల కార్మికులకు వసతి సమస్య తీరడంతో పాటు రవాణా భారం కూడా తగ్గుతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అభివృద్ధి చేయని భూముల (UDL) వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.




