తెలంగాణ పీజీ డాక్టర్లకు షాక్.. బాండ్ ఉల్లంఘిస్తే రూ. 20 లక్షల ఫైన్..

Medical PG Bond Rules: తెలంగాణ పీజీ వైద్యులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నిర్బంధ ప్రభుత్వ సేవలు (Bond) ఉల్లంఘిస్తే రూ. 20 లక్షల భారీ జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 2 April 2026 5:37 PM IST
Telangana Medical PG Bond Rules
X

తెలంగాణ పీజీ డాక్టర్లకు షాక్.. బాండ్ ఉల్లంఘిస్తే రూ. 20 లక్షల ఫైన్..

Telangana Medical PG Bond Rules: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు కచ్చితంగా ప్రభుత్వ సేవలు (Compulsory Government Service) అందించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (అకాడమిక్) డైరెక్టర్ డాక్టర్ కె. శివరామ్ ప్రసాద్ గురువారం కఠినమైన మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్‌ను విడుదల చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాతో పాటు కెరీర్ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

భారీ పెనాల్టీలు ఇవే..

ప్రభుత్వంతో కుదుర్చుకున్న బాండ్ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విధుల్లో చేరని లేదా మధ్యలో వదిలేసే వైద్యులకు కింది విధంగా జరిమానాలు విధిస్తారు.

పీజీ డిగ్రీ అభ్యర్థులు: రూ. 20 లక్షల జరిమానా.

డిప్లొమా అభ్యర్థులు: రూ. 15 లక్షల జరిమానా.

గరిష్టంగా 18 నెలల వ్యవధిలోపు ఈ సేవలను పూర్తి చేయని పక్షంలో ఈ పెనాల్టీలు వర్తిస్తాయి.

కెరీర్‌పై తీవ్ర ప్రభావం

బాండ్ నిబంధనలు పాటించని వైద్యులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో తదుపరి ఉన్నత చదువులు (సూపర్ స్పెషాలిటీ వంటివి) చదవడానికి వీరికి అనుమతి ఉండదు.

పనివేళలు.. సెలవులపై ఆంక్షలు

వైద్యులు తమ పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన 12 నెలల లోపు ఏడాది కాలం పాటు తప్పనిసరిగా సేవలు అందించాలి. ఈ కాలంలో సెలవులపై కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేవలం వారపు సెలవులు (Weekly offs), పోస్ట్ డ్యూటీ ఆఫ్స్ మరియు ఏడాదికి కేవలం 20 రోజుల క్యాజువల్ లీవ్స్ మాత్రమే అనుమతిస్తారు. అంతకు మించి ఇతర సెలవులకు వీల్లేదు. గర్భధారణ లేదా ప్రసూతి సంబంధిత కారణాలతో సెలవు కావాలంటే కఠినమైన ధృవీకరణ ప్రక్రియ తర్వాతే ప్రత్యేకంగా పరిశీలిస్తారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతను తీర్చేందుకు మరియు సామాన్యులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story