Meeseva Certificate: నీళ్లు పడినా పాడవదు.. చిరిగిపోదు.. మీ సేవ సర్టిఫికెట్లకు అడ్వాన్స్డ్ పేపర్
Meeseva Certificate: తెలంగాణలో మీ సేవ కేంద్రాల సర్టిఫికెట్ల ముద్రణకు 15 భద్రతా ఫీచర్లతో కూడిన కొత్త సెక్యూరిటీ పేపర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
Sridhar Babu
Meeseva Certificate: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక విషయంలో గుడ్ న్యూస్ అందింది. మీ సేవ కేంద్రాల ద్వారా పొందే వివిధ రకాల సర్టిఫికెట్ల రక్షణను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అత్యున్నత ప్రమాణాలు, 15 రకాల అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన కొత్త పేపర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రజాభవన్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ తాజా నిర్ణయంతో నకిలీ పత్రాల సృష్టికి శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది.
మీ సేవ సర్టిఫికెట్ల ముద్రణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త పేపర్లో ఏకంగా 15 రకాల సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. ప్రభుత్వ పత్రాలను అక్రమంగా కాపీ చేయడం లేదా నకిలీ ఆధారాలు సృష్టించడం వంటి నేరాలను నిరోధించడమే ప్రధాన లక్ష్యంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. సున్నితమైన భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫీచర్ల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. సాధారణ కాగితాలతో పోలిస్తే ఇది సులభంగా చిరిగిపోదు. నీళ్లు పడినా త్వరగా పాడవకుండా ఉండటం, మడతలు పడినా దెబ్బతినకపోవడం ఈ పేపర్ ప్రత్యేకత. దీనివల్ల ధ్రువపత్రాలకు ప్రత్యేకంగా లామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా వినియోగదారులకు తగ్గుతుంది.
జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు కుల, ఆదాయ, నివాస, విద్యా, ఉద్యోగ సంబంధిత సర్టిఫికెట్లు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో కీలకమైనవి. వీటిని ఏళ్ల తరబడి భద్రంగా దాచుకోవాల్సి ఉంటుంది. పాత కాలపు పేపర్లు కొన్నాళ్లకు రంగు మారడం, పాడవడం లేదా తడిసిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ సెక్యూరిటీ పేపర్ వల్ల పత్రాలు దశాబ్దాల పాటు భద్రంగా ఉంటాయి. అంతేకాకుండా అధికారులు అసలైన పత్రాన్ని క్షణాల్లో గుర్తించేలా రూపొందించిన డిజిటల్, ఫిజికల్ సెక్యూరిటీ కోడింగ్ నకిలీ డాక్యుమెంట్ల తయారీని పూర్తిగా అడ్డుకుంటుంది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, నాణ్యత, వినూత్న సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలు పొందే ప్రతి ప్రభుత్వ సర్టిఫికెట్ అత్యంత విశ్వసనీయంగా, మన్నికగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అప్‌గ్రేడ్ చేపట్టినట్లు వివరించారు. భవిష్యత్తులో మీ సేవ సేవలను మరింత వేగవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 నుంచి మీ సేవ కేంద్రాల్లో ఒకే రకమైన సెక్యూరిటీ పేపర్‌ను ముద్రణకు వాడుతున్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆ పాత విధాన స్థానంలో ఇప్పుడు అత్యాధునిక నాణ్యత కలిగిన కాగితం అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి. రవికిరణ్ తో పాటు ప్రింటింగ్ ఏజెన్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సెక్యూరిటీ పేపర్ విధానం మీ సేవ సేవల విశ్వసనీయతను మరింత పెంచుతుంది. పత్రాల మన్నిక పెరగడంతో పాటు నకిలీ సర్టిఫికెట్ల దందాకు ముగింపు పడనుండటం సామాన్య ప్రజలకు ఎంతో లబ్ధి చేకూర్చే పరిణామం.




