Telangana New Building Rules: ఇంటి నిర్మాణానికి ఇక ఈజీ పర్మిషన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana New Building Rules: తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చుకునే వారికి ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది.

Arun Chilukuri
Published on: 18 Nov 2026 12:42 PM IST
Telangana New Building Rules
X

Telangana New Building Rules: ఇంటి నిర్మాణానికి ఇక ఈజీ పర్మిషన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Telangana New Building Rules: సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే స్థలం కొనడం ఒక ఎత్తయితే, ఇంటి నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడం మరో పెద్ద ప్రహసనం. ప్లాట్ చిన్నదైతే సెట్‌బ్యాక్ నిబంధనలు, పార్కింగ్ స్థలం అంటూ ఎన్నో ఆంక్షలు నిర్మాణదారులకు భారంగా మారుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2012లో రూపొందించి ఇప్పటివరకు 62 సార్లు సవరణలు చేసిన పాత భవన నిర్మాణ నిబంధనల స్థానంలో, ఒకే సమగ్రమైన కొత్త నియమావళిని తీసుకొచ్చేందుకు మున్సిపల్ శాఖ అధికారులు ముసాయిదా సిద్ధం చేస్తున్నారు.

కొత్త ప్రతిపాదనల్లోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే:

100 గజాల వరకు అనుమతుల నుంచి మినహాయింపు: ప్రస్తుతం 75 గజాల వరకు ఉన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతుల నుంచి మినహాయింపు ఉంది. ఈ పరిమితిని 100 గజాలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే జరిగితే చిన్న ప్లాట్లలో ఇళ్లు కట్టుకునేవారు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది.

సెట్‌బ్యాక్ నిబంధనల్లో 20% సడలింపు: భవనం చుట్టూ వదలాల్సిన ఖాళీ స్థలం (Setback) నిబంధనలను సవరించే ప్రతిపాదన సిద్ధమవుతోంది. రోడ్డు వెడల్పు, ప్లాట్ విస్తీర్ణం, భవనం ఎత్తు ఆధారంగా వదిలే ఈ దూరాలను గరిష్ఠంగా 20 శాతం వరకు తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనివల్ల తక్కువ స్థలంలోనే ఎక్కువ నిర్మాణ విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.

600 గజాల స్థలంలోనే సెల్లార్ నిర్మాణానికి ఛాన్స్: నగరాల్లో పార్కింగ్ సమస్యను తగ్గించేందుకు సెల్లార్ నిర్మాణ అర్హతలను మార్చనున్నారు. ప్రస్తుతం 900 గజాల స్థలం ఉంటేనే సెల్లార్‌కు అనుమతి ఇస్తుండగా, ఈ పరిమితిని 600 గజాలకు తగ్గించాలని ప్రతిపాదించారు.

రెండు సెల్లార్లకు అనుమతి: 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ప్రస్తుతం ఒక సెల్లార్ మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ సంఖ్యను రెండు సెల్లార్లకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాలు నిలిపే సమస్య తగ్గుతుంది.

మార్టిగేజ్ నిబంధనపై పునరాలోచన: నిర్మాణ అనుమతి సమయంలో భవనంలోని కొంత భాగాన్ని తాకట్టు (Mortgage) పెట్టాల్సి రావడం బిల్డర్లకు భారంగా మారింది. ప్రాజెక్టు పూర్తయినా ఆస్తుల విక్రయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, నిర్దిష్ట పరిమాణంలోపు నిర్మాణాలకు ఈ మార్టిగేజ్ నిబంధనను పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అంశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో, ప్రతిపాదనల దశలో మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేసిన తర్వాత ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.