Kavitha: లోక్‌భవన్‌లో గవర్నర్‌తో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత భేటీ.. భూ నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం!

Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు, వికారాబాద్ కడ్లాపూర్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ..

Arun Chilukuri
Published on: 26 May 2026 3:17 PM IST
Kavitha
X

Kavitha: లోక్‌భవన్‌లో గవర్నర్‌తో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత భేటీ.. భూ నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం!

Kavitha: తెలంగాణలోని వివిధ ప్రాజెక్టుల కారణంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బాధితులు గవర్నర్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాలతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (RRR) బాధితులను వెంటబెట్టుకుని వెళ్లిన ఆమె.. వారి సమస్యలపై గవర్నర్‌కు సమగ్రమైన వినతిపత్రాన్ని అందజేశారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం లోక్‌భవన్ ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన భూ నిర్వాసితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిలువ నీడ కోల్పోయిన ఆ బాధితులందరికీ ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

మరోవైపు వికారాబాద్ జిల్లా కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరిట ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటీసులపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

"కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటీసులను తక్షణమే రద్దు చేయాలి. పరిశ్రమల పేరుతో రైతుల నోట్లో మట్టి కొట్టడం సరికాదు. అలాగే ట్రిపుల్ ఆర్ (RRR) అలైన్‌మెంట్ మార్పు వల్ల వందలాది మంది రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలపై బాధితుల తరఫున గవర్నర్‌కు పూర్తి వివరాలు అందించాం" అని కవిత పేర్కొన్నారు.

భూ నిర్వాసితుల సమస్యలపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కవిత వెల్లడించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో.. బాధితులను కలుపుకుని పెద్ద ఎత్తున మళ్లీ పోరాట బాట పడతామని ఆమె హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story