Constable Jobs: నిరుద్యోగులకు భారీ ఊరట.. కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో 3 ఏళ్ల వయో సడలింపు

Constable Jobs: తెలంగాణలో ఖాకీ దుస్తులు ధరించాలని కలలుకంటున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.

CR Reddy
Published on: 10 Sept 2026 8:14 AM IST
Telangana Police
X

Telangana Police

Constable Jobs: తెలంగాణలో ఖాకీ దుస్తులు ధరించాలని కలలుకంటున్న లక్షలాది మంది నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నిరుద్యోగులకు ఏకంగా పదేళ్ల వరకు వయో సడలింపు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం సన్నాహాలు చేస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించింది. ఇన్నాళ్లూ తెలంగాణలో ఎస్సై పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలుగా ఉండగా, కానిస్టేబుల్ పోస్టులకు మాత్రం 29 ఏళ్లుగా ఉండేది. ఒకే విభాగంలో ఉండే రెండు వేర్వేరు పోస్టుల మధ్య ఈ వయస్సు వ్యత్యాసం ఉండటంపై అభ్యర్థుల నుంచి ఎప్పటి నుంచో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఎస్సై అభ్యర్థులతో సమానంగా కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితిని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏయే విభాగాలకు ఈ సడలింపు వర్తిస్తుంది?

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ద్వారా భర్తీ చేసే అనేక కీలక విభాగాలు ఈ నిర్ణయం పరిధిలోకి వస్తాయి. శాంతిభద్రతల రక్షణలో ఉండే హోమ్‌శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఈ అదనపు వయో సడలింపు వర్తించనుంది. వీటితో పాటు కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర రిక్రూట్‌మెంట్‌లకు సైతం ఈ సడలింపు లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. గతంలో అమల్లో ఉన్న ఏడేళ్ల మినహాయింపుకు అదనంగా ఈ మూడేళ్లు తోడవడంతో వయస్సు దాటిపోయిందనే బాధతో ఉన్న వేలాది మందికి మళ్లీ పోటీ పడే అవకాశం దక్కింది.

ఆ ఒక్క పోస్టుకు మాత్రం మినహాయింపు

ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించిన అధికారిక జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు విడుదల చేశారు. అయితే డ్రైవింగ్ విభాగంలో చేరాలనుకునే వారికి ఒక చిన్న నిరాశ ఎదురైంది. పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు మాత్రం ఈ అదనపు మూడేళ్ల సడలింపు వర్తించదని జీవోలో తేల్చి చెప్పారు. కాబట్టి డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు ఆయా విభాగాలకు నిర్దేశించిన ప్రత్యేక వయోపరిమితి నిబంధనలను నోటిఫికేషన్ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ల కోసం పెరిగిన నిరీక్షణ

వయోపరిమితి పెరిగినంత మాత్రాన సరిపోదని, ఫిజికల్ మెజర్‌మెంట్స్, విద్యార్హతలు, ఇతర ఫిట్‌నెస్ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే కొత్త నోటిఫికేషన్లలో ఈ సడలింపులు వర్తింపజేయనున్నారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో నానా అవస్థలు పడుతూ గ్రౌండ్స్ చుట్టూ తిరుగుతున్న కుర్రాళ్లకు ఈ నిర్ణయం కొత్త ఊపిరి పోసింది. రాబోయే పోలీస్ నియామకాల పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story