Telangana Power Tariff Hike: కరెంట్ బిల్లుల భారం.. నవంబర్ నుంచి ట్రూ-అప్ ఛార్జీలు!
Telangana Power Tariff Hike: తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూ-అప్ భారం పడనుంది. నవంబర్ బిల్లుల నుంచే యూనిట్‌కు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
Telangana Power Tariff Hike: కరెంట్ బిల్లుల భారం.. నవంబర్ నుంచి ట్రూ-అప్ ఛార్జీలు!
Telangana Power Tariff Hike: తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాల సర్దుబాటు కోసం 'ట్రూ-అప్' (True-Up) ఛార్జీల రూపంలో రూ.5,420.23 కోట్ల భారాన్ని మోపేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముంచుకొస్తున్న నవంబర్ నెల విద్యుత్ బిల్లుల నుంచే ఈ కొత్త పెంపు అమలులోకి రానుంది. మొదట తొలి నెలలో యూనిట్‌కు 30 పైసల చొప్పున వసూలు చేయనుండగా, ఆ తర్వాతి నెలల నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా విధించనున్నారు.
డిస్కంల ప్రతిపాదనల మేరకు మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అయితే ఇందులో సామాన్య రైతులకు ఊరటనిస్తూ వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు పూర్తిగా మినహాయింపునిచ్చారు. రైతుల వాటాగా ఉన్న రూ.2,214.99 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించింది. మిగిలిన రూ.5,420.23 కోట్లను ఇతర గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. ఇందులో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో రూ.4,222.93 కోట్లు, ఉత్తర తెలంగాణ డిస్కం (TGNPDCL) పరిధిలో రూ.1,197.30 కోట్లు చొప్పున రాబట్టనున్నారు.
విద్యుత్ వినియోగదారులు చెల్లించే నెలవారీ బిల్లుల్లో ఈ ట్రూ-అప్ ఛార్జీని ప్రత్యేకంగా ముద్రించాలని డిస్కంలకు టీజీఈఆర్సీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వసూలు విధానం, విధించే రేటు మరియు ఎంత కాల పరిమితిలో వసూలు చేస్తారనే వివరాలను బిల్లుపై స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. పాత వినియోగ ప్రమాణాల ఆధారంగా లెక్కించే ఈ ఛార్జీలను టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 29 నెలల పాటు, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 26 నెలల పాటు వసూలు చేయనున్నారు. ఈ పెంపుపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ముందస్తుగా ప్రచారం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించింది.




