Electricity Charges: కరెంటు షాక్ అంటే ఇదే.. నవంబర్ నుంచి భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
Electricity Charges: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం పెద్ద భారమే మోపబోతోంది.
Electricity Charges: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం పెద్ద భారమే మోపబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా దాదాపు రూ.5,420 కోట్ల అదనపు మొత్తాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతో సేకరించడానికి డిస్కంలు సిద్ధమయ్యాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతితో ఈ నిర్ణయం అమలులోకి రానుంది. గత రెండు ఏళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలకు వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై 30 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. ఆ తర్వాతి నెల అయిన డిసెంబర్ నుంచి ఈ అదనపు మోత యూనిట్‌కు 50 పైసలకు చేరనుంది. దక్షిణ తెలంగాణ పరిధిలోని TGSPDCL వినియోగదారులకు ఈ ఛార్జీలు 29 నెలల పాటు వర్తిస్తాయి. అలాగే ఉత్తర తెలంగాణ పరిధిలోని TGNPDCL పరిధిలో ఉండే ప్రజలకు 26 నెలల పాటు ఈ అదనపు బిల్లుల సెగ తగలనుంది.
అయితే ఈ పెంపు నుంచి కొంతమందికి ఉపశమనం లభించింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడుతున్న దాదాపు 53 లక్షల కుటుంబాలకు ఈ అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు ఎటువంటి అదనపు బిల్లు రాదు. కానీ, 200 యూనిట్లు దాటి విద్యుత్ వినియోగించే ప్రతి గృహ వినియోగదారుడిపై ఈ పెంపు ప్రభావం స్పష్టంగా పడనుంది.
ఈ పెంపుపై రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉండే రోజుల్లో టీవీ, ఫ్రిజ్, ఫ్యాన్లు, లైట్లు వాడితేనే చాలా సులభంగా 200 యూనిట్ల పరిమితి దాటిపోతుందని వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించి డిస్కంలకు చెల్లించిందని, ఇప్పుడు ఆ భారాన్ని తమపై వేయడం సరికాదని విమర్శిస్తున్నారు. నిత్యావసర ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి ఈ కరెంటు షాక్ మరింత ఇబ్బందిగా మారనుంది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయం పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సాధారణ పంపిణీ ఛార్జీలకు తోడు ఈ ట్రూఅప్ రుసుములు కలిపి రానున్నందున ప్రజలు కరెంటు వాడకంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఈ భారంపై ప్రభుత్వం పునరాలోచించి తమకు కాస్త ఉపశమనం కలిగించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.




