Weather Update : తెలంగాణకు అదిరిపోయే చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వానలు, వాతావరణ శాఖ కీలక ప్రకటన
Weather Update : తెలంగాణలో ఎండల తీవ్రతకు చెక్ పడనుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
telangana rain alert
Weather Update : భానుడి భగభగలతో ఉడికిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరి, సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. నైరుతి రుతుపవనాలు పలకరించబోతున్నాయి. ఇప్పటికే అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయని, మరో 24 గంటల్లో ఇవి దక్షిణ అండమాన్‌ను తాకనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనివల్ల రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి, త్వరలోనే వానలు ప్రారంభం కానున్నాయి.
రుతుపవనాల రాక ఎప్పుడంటే?
భారత వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడ వాతావరణం అనుకూలిస్తే, మరో నాలుగైదు రోజుల్లోనే అంటే జూన్ మొదటి వారంలో ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాల కదలికకు బాగా సహకరిస్తోంది. దీనివల్ల ఈసారి వర్షాలు సమయానికే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
నేడు ఈ జిల్లాల్లో వర్ష సూచన
రుతుపవనాల రాక కంటే ముందే రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించారు. ఈ వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించనుంది.
ఎండలు ఇంకాస్త ఎక్కువే.. జాగ్రత్త!
రుతుపవనాలు వచ్చే వరకు అంటే మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శనివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం ఉండటంతో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళ వేడి గాలులు వీస్తుండటంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.




