కొత్త బండి కొంటున్నారా? ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ ఉన్నవారికి అదిరిపోయే న్యూస్!
Registration Rules: వాహనానికి ప్రత్యేకమైన లేదా లక్కీ నంబర్ (ఫ్యాన్సీ నంబర్) కేటాయించుకోవాలనుకునే వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ (TG RTA) కీలక ఉపశమనం కలిగించింది.
కొత్త బండి కొంటున్నారా? ఫ్యాన్సీ నంబర్ క్రేజ్ ఉన్నవారికి అదిరిపోయే న్యూస్!
Registration Rules: కొత్తగా కార్ లేదా బైక్ కొనుగోలు చేసి, తమ వాహనానికి ప్రత్యేకమైన లేదా లక్కీ నంబర్ (ఫ్యాన్సీ నంబర్) కేటాయించుకోవాలనుకునే వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ (TG RTA) కీలక ఉపశమనం కలిగించింది. ఇప్పటివరకు ఫ్యాన్సీ నంబర్‌ను సెలెక్ట్ చేసుకునేందుకు ఉన్న కాలపరిమితిని రవాణా శాఖ భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వాహన యజమానులకు తమకు నచ్చిన నంబర్‌ను వేలం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసుకునేందుకు మరింత అదనపు సమయం లభించనుంది.
30 రోజుల నుంచి 60 రోజులకు గడువు పెంపు
సాధారణంగా ఏదైనా కొత్త వాహనం షోరూమ్ నుండి కొనుగోలు చేసినప్పుడు, రవాణా శాఖ అధికారులు ముందుగా దానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ (Temporary Registration - TR) నంబర్‌ను కేటాయిస్తారు. గత నిబంధనల ప్రకారం ఈ టీఆర్ గడువు కేవలం 30 రోజులు మాత్రమే ఉండేది. ఆ ఒక నెల లోపే వాహనదారులు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసుకుని, ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే చాలామంది యజమానులు తాము కోరుకున్న సిరీస్ నంబర్ అందుబాటులో లేకపోవడం వల్ల, ఆన్‌లైన్ వేలం (RTA Auction) ప్రక్రియలో అనుకోని కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన రవాణా శాఖ, టీఆర్ గడువును ఏకంగా 60 రోజులకు (రెండు నెలలు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
లైట్ తీసుకుంటే సాధారణ నంబరే.. ఆర్టీఏ హెచ్చరిక
వాహనం కొనుగోలు చేసే సమయంలో ఫ్యాన్సీ నంబర్ కావాలని ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నంబర్ బుక్ చేసుకోని వారు వెంటనే అలర్ట్ అవ్వాలని అధికారులు సూచించారు. కొత్త రూల్స్ ప్రకారం, తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) వచ్చిన తేదీ నుండి రెండు నెలల లోపు గనుక మీకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్‌ను ఖరారు చేసుకోకపోతే.. సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ వాహనానికి నార్మల్ సిరీస్‌లో అందుబాటులో ఉన్న సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కేటాయించేస్తుంది.
ఆ తర్వాత ఛాన్స్ ఉండదు!
ఒకసారి మీ వాహనానికి సిరీస్ ప్రకారం సాధారణ నంబర్ కేటాయించబడిన తర్వాత, మళ్లీ దానిని మార్చుకుని ఫ్యాన్సీ నంబర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రవాణా శాఖ సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి వీలుండదని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి తమ వాహనాలపై క్రేజీ లేదా సెంటిమెంట్ నంబర్లు ఉండాలనుకునే వారు, రవాణా శాఖ ఇచ్చిన ఈ 60 రోజుల అదనపు గడువును సద్వినియోగం చేసుకుని నిర్ణీత సమయంలోపు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.




