RTC Strike : సచివాలయంలో సఫలమైన చర్చలు.. శనివారం ఉదయం నుంచే యధావిధిగా ఆర్టీసీ బస్సులు

RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగిసింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో 10% పీఆర్సీ, విలీనంపై హామీ లభించింది. ఏప్రిల్ 25 నుంచి బస్సులు యథావిధిగా నడవనున్నాయి.

CR Reddy
Published on: 25 April 2026 6:40 AM IST
TSRTC
X

 TSRTC

RTC Strike :తెలంగాణలో గత మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వం దిగిరావడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఏప్రిల్ 25 (శనివారం) ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే బస్సులు రోడ్డెక్కనున్నాయి. ప్రయాణికులకు ఊరట లభించింది. తెలంగాణ సచివాలయంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అధికారుల కమిటీతో మొదలైన ఈ భేటీ, మధ్యాహ్నం నుంచి మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో సుమారు 13 గంటల పాటు సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. కార్మికులు పెట్టిన 32 డిమాండ్లలో మెజారిటీ అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా వేతన సవరణ (PRC), విలీనం వంటి కీలక అంశాలపై ప్రతిష్టంభన ఏర్పడినా, చివరకు అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో సయోధ్య కుదిరింది.

కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ ప్రక్రియను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, 2021 వేతన సవరణకు సంబంధించి 10 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో పాటు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉద్యోగుల బదిలీలు చేపట్టబోమని, కారుణ్య నియామకాలను పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. కార్మిక సంఘాలను పునరుద్ధరించడం వల్ల ఉద్యోగుల సమస్యలను నేరుగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నేతలు పట్టుబట్టగా, మంత్రులు సానుకూలంగా స్పందించారు. మిగిలిన చిన్న చిన్న డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చని మంత్రులు సూచించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లభించడంతో జేఏసీ నేతలు సమ్మె విరమణ ప్రకటన చేశారు.

సమ్మె రెండో రోజే డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం, మరో ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు యత్నించడం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. కార్మికుల ఆగ్రహం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం మెత్తబడింది. శనివారం శంకర్ గౌడ్ అంత్యక్రియలు ఉన్నందున, ఆ లోపే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. అందుకే చర్చలు అర్ధరాత్రి వరకు సాగించి కార్మిక నేతలను సచివాలయానికే పరిమితం చేశారనే చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా, మూడు రోజుల సమ్మె ముగియడంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు యథావిధిగా అందుబాటులోకి రానున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story