Rythu Bharosa : రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ రైతులకు కూడా ఇకపై పెట్టుబడి సాయం
Rythu Bharosa : తెలంగాణలో కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి రైతు భరోసా దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. జులై 5 లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Rythu Bharosa
Rythu Bharosa : తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలకమైన శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న కొత్త రైతులకు లబ్ధి చేకూర్చేలా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. చాలా రోజులుగా భూములు కొనుగోలు చేసి లేదా వారసత్వంగా పొంది, కొత్తగా పట్టాదార్ పాసు పుస్తకాలు తెచ్చుకున్న రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. అర్హత కలిగిన రైతులందరూ తమ మండల కేంద్రాల్లో లేదా క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ అధికారులను కలిసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దరఖాస్తు చేసుకోవడానికి జులై 5 ఆఖరి గడువు
ఈ విడత పెట్టుబడి సాయం పొందాలనుకునే కొత్త రైతులు ఒక ముఖ్యమైన తేదీని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ లోపు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి, చేతికి పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు ప్రభుత్వం జులై 5వ తేదీ వరకు గడువు విధించింది. ఒకవేళ ఏ కారణం చేతనైనా జులై 5 లోపు దరఖాస్తు చేసుకోకపోతే, ఈ విడతలో వచ్చే రైతు భరోసా నిధులు ఆయా అకౌంట్లలో జమ కావు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి తదుపరి విడతలోనే అవకాశం కల్పిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఎలా చేయాలంటే
ప్రస్తుతానికి ఈ రైతు భరోసా కొత్త దరఖాస్తుల ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే సాగుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఎక్కడా లేదు. రైతులు నేరుగా తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) లేదా క్లస్టర్ ఆఫీసర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వారి దగ్గర లభించే ప్రత్యేక దరఖాస్తు ఫారమ్‌ను తీసుకొని, అందులో అడిగిన వివరాలన్నీ తప్పులు లేకుండా నింపాలి. ఆ ఫారమ్‌తో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలను జత చేసి అధికారులకు ఫిజికల్‌గా అందజేయాలి. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన ముగిశాక అధికారులు మీ పేరును లబ్ధిదారుల లిస్టులో చేర్చుతారు.
కావాల్సిన ముఖ్యమైన పత్రాల వివరాలు
కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తమ వెంట కొన్ని కీలక పత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడి గుర్తింపు కార్డు కాపీ, కొత్తగా వచ్చిన పట్టాదార్ పాసుబుక్ జిరాక్స్, అలాగే డబ్బులు జమయ్యేందుకు వీలుగా బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీని దరఖాస్తు ఫారమ్‌కు జత చేయాలి. ఈ పత్రాలన్నింటినీ ఏఈఓలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. మీ భూమి వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే, సదరు దరఖాస్తును జిల్లా స్థాయి అధికారుల ఆమోదం కోసం ఫార్వార్డ్ చేస్తారు.
అర్హతలు, కఠినమైన నిబంధనలు
రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఖచ్చితంగా తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. దరఖాస్తుదారుడి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండటంతో పాటు, భూమి ఖచ్చితంగా వారి పేరు మీదే రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే అటవీ హక్కుల గుర్తింపు పట్టాలు కలిగిన గిరిజన రైతులు కూడా ఈ పథకానికి పూర్తిగా అర్హులు. అయితే, సాగుకు పనికిరాని బీడు భూములు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన ప్లాట్లు, కాలువలు, రాళ్లు రప్పలతో నిండిన భూములకు ఎలాంటి రైతు భరోసా సాయం వర్తించదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
జూన్ 30 నుంచి అకౌంట్లలోకి పెట్టుబడి సాయం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత లబ్ధిదారులతో పాటు, కొత్తగా జులై 5 లోపు దరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి జూన్ 30వ తేదీ నుంచి విడతల వారీగా నిధులు విడుదల కానున్నాయి. మొదట ఒక ఎకరం భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు. కేవలం పది రోజుల్లోనే అర్హులైన రైతులందరి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ అయ్యేలా ఆర్థిక, వ్యవసాయ శాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.




