Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు
Telangana: తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది.
Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు
Telangana: తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త విధానం అమల్లోకి వస్తే విద్యార్థులు తమకు రావాల్సిన నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే పొందనున్నారు.
2026-27 నుంచి కొత్త విధానం అమలు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రతిపాదనల ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రస్తుతం నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. అర్హత నిర్ధారణ పూర్తైన తర్వాత తక్కువ సమయంలోనే నిధులు అందేలా చర్యలు చేపడుతున్నారు.
దరఖాస్తు ఆమోదం తర్వాత నెలలోపు చెల్లింపులు
కొత్త విధానంలో దరఖాస్తు పరిశీలన పూర్తై ఆమోదం లభించిన తర్వాత ఒక నెలలోపు ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల మొత్తాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే విద్యార్థుల ఖాతాల్లో జమ అయిన ఫీజు మొత్తాన్ని నిర్ణీత గడువులోగా సంబంధిత కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారంరోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని పక్షంలో సంబంధిత మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఆధార్, బ్యాంకు ఖాతా తప్పనిసరి
ఈ సదుపాయాలను పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న పేరు, విద్యా ధ్రువపత్రాల్లో ఉన్న వివరాలు ఒకే విధంగా ఉండాలి. అలాగే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ ధ్రువీకరణ పూర్తికావడం, కళాశాల నుంచి డిజిటల్ సర్టిఫికేషన్ రావడం, జిల్లా స్థాయి అధికారుల ఆమోదం పొందడం వంటి ప్రక్రియల అనంతరం మాత్రమే నిధులు విడుదల చేయనున్నారు.
ఈ-పాస్ పోర్టల్‌కు విద్యాశాఖ డేటా అనుసంధానం
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ-పాస్ వ్యవస్థను విద్యాశాఖ డేటాబేస్‌తో అనుసంధానించనుంది. దీంతో విద్యార్థుల ప్రవేశాలు, కోర్సు వివరాలు, అర్హతకు సంబంధించిన సమాచారం నేరుగా అందుబాటులోకి వస్తుంది. ఈ మార్పుతో దరఖాస్తుల పరిశీలనలో మానవ తప్పిదాలు తగ్గడంతో పాటు అనవసర ఆలస్యాలకు కూడా చెక్ పడే అవకాశం ఉంది. విద్యార్థులకు నిధులు వేగంగా చేరేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి.
70 శాతం హాజరు ఉంటేనే ప్రయోజనం
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మరో ముఖ్యమైన నిబంధన హాజరు శాతం. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందాలంటే విద్యార్థులు కనీసం 70 శాతం హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక బకాయిలు పేరుకుపోకుండా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల మేర నిధులు విడుదల చేసే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ శాఖలతో చర్చలు పూర్తయ్యాయని, ప్రతిపాదనలకు సంబంధిత మంత్రి ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రిఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, స్కాలర్‌షిప్‌లతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందే పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు.




